రాష్ట్ర శాసనసభ మూడో విడత సమావేశాలు మంగళవారం ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుండగా, శాసనమండలి సమావేశాలు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతాయి.అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 31 వరకు కొనసాగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఈ ఏడాది ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల సభ సంతాపం ప్రకటిస్తుంది. అదే విధంగా ఇటీవలి కాలంలో మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా సంతాపం తెలుపనున్నారు. అనంతరం సభను తిరిగి ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తారు. సభ వాయిదా అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన ఆయన ఛాంబర్‌లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది.
సమావేశంలో సభ ఎజెండా, ఎన్ని రోజులు నిర్వహిస్తారనే దానిపై తేదీలు ఖరారు చేయనున్నారు. ఈ నెల 24న రైతు రుణమాఫీ అంశంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తారు. ఈ నెల 25న శాసనసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. సభ్యులు బడ్జెట్ ను అధ్యయనం చేసేందుకు 26న సమావేశాలకు విరామం ప్రకటించనున్నారు. 27న బడ్జెట్ ప్రసంగంపై చర్చ ప్రారంభం కానుంది. 28న ఆదివారం, 29న బోనాల పండుగ కావడంతో సభకు విరామం ప్రకటించనున్నట్లు సమాచారం. తిరిగి ఈనెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిమాండ్లపై చర్చ నిర్వహించనున్నారు. 31న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి, ఆమోదించనున్నారు. ఈ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీతో పాటు పలు ప్రభుత్వ బిల్లులు సభ ముందుకు రానున్నట్లు సమాచారం.
25న 9 గంటలకు మంత్రివర్గ భేటీ
అసెంబ్లీలో ఈ నెల 25న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ మీటింగ్ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. తొలి విడత సమావేశాలు డిసెంబర్ 9 నుంచి 21 వ తేదీ వరకు, రెండో విడత ఫిబ్రవరి 9 నుంచి 17 తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు జరిగాయి.
అసెంబ్లీ సమావేశాల తొలిరోజు స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశానికి బీఆర్‌ఎస్ ప్రతినిధిగా మాజీ మంత్రి హరీష్‌రావు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో కడియం శ్రీహరి హాజరుకాగా, ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఎల్ఓపీ నేతగా కేసీఆర్ ఉన్నప్పటికీ ఆయన సూచన మేరకు హరీష్ రావు హాజరవుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా ఉదయం 10 గంటలకు శాసనసభ ఎదురుగా ఉన్న గన్‌పార్కులో అమరవీరులకు నివాళులర్పించనున్నారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారని పార్టీ నేతలు తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడో శాసనసభ సమావేశాలు రెండు విడతలు నిర్వహించారు. ఈ రెండు విడతల సమావేశానికి మాజీ సీఎం, ఎమ్మెల్యే కేసీఆర్ హాజరు కాలేదు. కానీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారని పార్టీ నేతలు తెలిపారు. ఈ నెల 25న శాసనసభలో బడ్జె్‌ట్ ప్రవేశ పెట్టనున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా పాల్గొంటున్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ప్రతిపక్షం ఏమిటో చూపుతామని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అసెంబ్లీ వేదికగా ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పార్టీ మారిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించేందుకు బీఆర్‌ఎస్ సన్నద్దమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa