హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారంటూ బుధవారం(ఆగస్టు 14) ఉదయం నుంచి.. నాగోల్ స్టేషన్‌లో ప్రయాణికులు తీవ్ర ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై.. అటు నగరవాసుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇదే విషయమై నెట్టింట.. రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ పార్కింగ్ ఫీజుల విషయంపై మెట్రో యాజమాన్యం స్పందిస్తూ.. పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే.. నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఈరోజు పార్కింగ్ ఫీజు వసూలు చేసింది నిజమే కానీ.. ఇది కేవలం పైలట్ రన్ మాట్రమేనని మెట్రో యాజమాన్యం స్పష్టతనిచ్చింది.
ఆగస్టు 25వ తేదీ నుంచి నాగోల్ మెట్రో స్టేషన్‌లో, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్‌లో పార్కింగ్ ఫీజుల వసూళ్లు అధికారికంగా ప్రారంభమవుతాయని మెట్రో యాజమాన్యం ప్రకటించింది. అయితే.. ఈరోజు పైలట్ రన్‌లో భాగంగానే.. వివిధ సిస్టమ్‌ల పని తీరు, సామర్థ్యాన్ని పరీక్షించడానికి నాగోల్ పార్కింగ్ సదుపాయంలో ట్రయల్ నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మెట్రో స్టేషన్‌లో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మెట్రో యాజమాన్యం.. తమ ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు తెలిపింది.
మరోవైపు.. పార్కింగ్ ఫీజు వసూలు చేయటంపై నెట్టింట తీవ్ర విమర్శలు రాగా.. అందులో చాలా మంది పార్కింగ్ సదుపాయల్లో ఉన్న అసౌకర్యాలను ఎత్తి చూపారు. ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న యాజమాన్యం.. వాటిపై కూడా క్లారిటీ ఇస్తూ.. పార్కింగ్ విషయంలో తీసుకురానున్న సౌకర్యాలను ప్రకటించింది.
పార్కింగ్ ఫెసిలిటీల్లో ప్రత్యేకతలు:
క్రమబద్ధమైన పార్కింగ్‌లో భాగంగా.. ద్విచక్ర వాహనాలు, ఫోర్ విల్లర్స్ వాహనాలకు మధ్య స్పష్టమైన హద్దులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.
మెరుగైన సౌకర్యాలు.. ప్రయాణికుల సౌకర్యార్థం పార్కింగ్ ప్రాంతాల్లో బయో-టాయ్‌లెట్లు కూడా ఏర్పాటుచేస్తామని తెలిపింది.
మెరుగైన భద్రతలో భాగంగా.. 24/7 సీసీటీవీ నిఘాతో పాటు ఆన్-గ్రౌండ్ భద్రత కూడా కల్పిస్తామని తెలిపింది.
సౌకర్యవంతమైన చెల్లింపు విధానాల కోసం.. సులభతరమైన యాప్ ఆధారిత (క్యూఆర్ కోడ్) చెల్లింపు ఆప్షన్లు కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
మెరుగైన లైటింగ్ కూడా ఏర్పాటు చేయనున్నట్టు మెట్రో యాజమాన్యం ప్రకటించింది.
ప్రయాణికుల సౌకర్యార్థం కోసం.. పార్కింగ్ ఫీజు వివరాలను రెండు ప్రాంతాల్లోను ప్రముఖంగా డిస్‌ప్లే చేస్తామని తెలిపింది.
మెట్రో ప్రయాణికులు జేబులకు చిల్లు!
అయితే.. ఇవన్నీ కూడా తమ విలువైన ప్రయాణికులకు సురక్షితమైన, మరింత సౌకర్యవంతమైన పద్ధతి ప్రకారంగా ఉండే పార్కింగ్ అనుభూతిని కల్పించగలవని తాము విశ్వసిస్తున్నామని యాజమాన్యం ప్రకటించింది. తమ మద్దతు, సహకారాన్ని అందించాల్సిందిగా ప్రయాణికులను హైదరాబాద్ మెట్రో యాజమాన్యం కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa