సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొన్నటివరకు రైతులకు 2 లక్షల మేర రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు నేతన్నలకు కూడా రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ నాంపల్లిలో ఐఐహెచ్‌టీ (Indian Institute of Handloom Technology)ని సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఐఐహెచ్‌టీని ప్రారంభించడం సంతోషకరమని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణకు చెందిన విద్యార్థులు ఏపీ, ఒడిశాకు వెళ్లి హ్యాండ్లూమ్ కోర్సులు చదవాల్సి వస్తోందన్న రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడి ఐఐహెచ్‌టీకి అనుమతులు తీసుకొచ్చుకున్నామని తెలిపారు. విద్యార్థుల సమయం వృథా కాకూడదని.. తెలుగు యూనివర్సిటీలో ఈ ఏడాది నుంచే ఐఐహెచ్‌టీ తరగతులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఐఐహెచ్‌టీని స్కిల్ యూనివర్సిటీకి తరలిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కోర్సు చేసే విద్యార్థులకు ఒక్కొక్కరికి నెలకు 2500 స్టై ఫండ్ ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే.. చేనేతలకు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చేనేత వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు కాంగ్రెస్ సర్కార్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే.. నేతన్నలకు కూడా రుణమాఫీ ఇస్తున్నామని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి.. రుణమాఫీకి ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నామని ప్రకటించారు. చేనేతల సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడు ముందు ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలోని నేతన్నలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని వివరించారు. నేతన్న కొండా లక్ష్మణ్ బాపూజీ తన పదవిని తృణప్రాయంగా త్యాగం చేశారని గుర్తు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి పేరును.. ఐఐహెచ్‌టీకి పెట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే.. చేనేతలకు రుణమాఫీ అంశంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. రైతులకు చేసినట్టుగానే 2 లక్షల మేర రుణం మాఫీ చేస్తారా.. లేదా నేతన్నలకు ప్రత్యేక విధి విధానాలు ఉంటాయా అన్నది తెలియాల్సి ఉంది. కాగా.. ఇప్పటికీ రైతు రుణమాఫీపై రగడ కొనసాగుతూనే ఉంది. రుణమాఫీ పూర్తి చేశారమని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంటే.. సగం మందికే ఉచ్చి మొత్తం ఇచ్చామని బడాయి చెప్పుకుంటోందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో.. ఇప్పుడు చేనేతలకు రుణమాఫీ అంటూ ప్రభుత్వం ప్రకటన చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa