ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, జాగ్రత్తగా ఉండండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2024, 10:04 PM

తెలంగాణలో మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దాని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరో రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ అల్పపీడనం సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉన్నట్లు అధికారులు తెలిపారు.


నేడు నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి మహబాబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో పాటుగా ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నేడు విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.


హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం (సెప్టెంబర్ 23) సాయంత్రం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. దీంతో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, ముషీరాబాద్, చంపాపేట, సైదాబాద్, సరూర్ నగర్, కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, మల్లాపూర్, దిల్‌సుఖ్ నగర్, మలక్‌పేట, బహదూర్‌పుర, ఉప్పుగూడ, నాంపల్లి, బషీర్ బాగ్, నాగోల్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, బోయినపల్లి, హిమయత్ నగర్, నారాయణగూడ, ఎల్బీనగర్, అల్వాల్, చిలకలగూడ, సుచిత్ర, గుండ్లపోచంపల్లి, కార్వాన్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.


చైతన్యపురి కమలానగర్‌లో మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచింది. నీళ్లు రహదారిపై నిలవడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడ్డారు. విజయవాడ జాతీయ రహదారిపై ఔటర్ రింగ్ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నేడు కూడా వర్షం హెచ్చరికలు ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని ప్రజలను హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa