ఓరి మీ దుంపలు తెగ.. మీరెక్కడ తయారయ్యార్రా బాబూ.. ఇంత బరి తెగించారేంట్రా.. ఎవరైనా వస్తారు, చూస్తారు అన్న భయమేమి లేకుండా పోయింది. కనీసం సీసీ కెమెరాలు ఉన్నాయన్న ధ్యాసైనా ఉండాలిగా.. అది కూడా డోరు బయటే.. లిఫ్ట్ ముందే పని కానిస్తుంటే.. ఎంటా ధైర్యం అనుకోవాలా.. పూర్తిగా బరితెగించారనుకోవాలా.. మరీ ఇంత దిగజారిపోయారనుకోవాలా.. అర్థం కాని పరిస్థితి. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా.. హైదరాబాద్ అంబర్ పేటలోని ఓ అపార్టుమెంట్‌లో ఓ యువకుడు వెలగబెట్టిన యవ్వారం గురించే ఇదంతా. అదేదో వాడి సొంత అపార్ట్ మెంట్ అయినట్టు దర్జాగా వచ్చి.. డోర్ పక్కనే ఉన్న చెప్పుల స్టాండ్‌లో నుంచి ఇష్టమైన చెప్పులు, షూలు తీసుకుని ఊడాయించాడు. అదేంటీ.. ఇప్పటివరకు చెప్పింది ఓ దొంగతనం గురించా.. అది కూడా చెప్పుల దొంగతనమా అని ముఖాన్ని మరీ అన్ని వంకర్లు తిప్పేసుకోకండి. ఈ దొంగ తీరు చూస్తే.. మీకూ ఆశ్చర్యమేస్తుంది.
సాధారణంగా ఎవరైనా దొంగ.. ఖరీదైన అపార్ట్ మెంటుకు వెళ్లి.. విలువైన వస్తువులో, డబ్బులో, నగలో చోరీ చేస్తుంటారు. కానీ.. ఇక్కడ దొంగ మాత్రం చోరీకి కాదేది అనర్హం అన్నట్టుగా.. పొద్దుపొద్దున్నే వెళ్లి చెప్పులు, షూలు దొంగతనం చేశాడు. అయితే.. ఆ దొంగ చెప్పులు, షూలు కొట్టుకెళ్లటమే ఓ ఆశ్చర్యమంటే.. వాడు దొంగతనం చేసిన పద్దతి మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అంబర్‌పేట్ పరిధి ప్రేమ్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అక్టోబర్ 01న తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఓ దొంగ దూరాడు. అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లోర్‌కి చేరుకున్న ఆ దొంగ.. నేరుగా ఓ ఇంటి ముందున్న చెప్పుల స్టాండ్ దగ్గరికి వెళ్లి.. అక్కడున్న కొత్త చెప్పులు, షూస్ తీసి పక్కన పెట్టుకున్నాడు. అదే క్రమంలో.. ఎదురుగా ఉన్న ఇంటి ముందు ఉన్న చెప్పులను కూడా తీసుకొచ్చుకున్నాడు. ఓ నాలుగైదు జతలను పోగేసుకున్న దొంగ.. వాటిని సర్దుకుని వెళ్లిపోతాడనుకుంటే.. మెల్లగా పైఫ్లోర్‌కి వెళ్లాడు. పై ఫ్లోర్‌లో కూడా చెప్పులను సర్దేసుకున్నాడు ఆ దొంగ.
విచిత్రమేంటంటే.. దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఎవరైనా.. కొంత బెరుకుగా ఎవరైన వస్తారేమో అన్న అదుర్ధగా ఉంటారు.. తొందర తొందరగా పని కానిచ్చేసి.. అక్కడి నుంచి జారుకుందామనుకుంటారు. కానీ.. ఈ దొంగ మాత్రం దర్జాగా.. ఏదో చెప్పుల దుకాణానికి కొనుక్కునేందుకు వచ్చి.. తనకు నచ్చిన జతలు సెలెక్ట్ చేసుకున్నట్టుగా.. చెప్పులు, షూలను తీసుకుంటున్నాడు.
ఏమాత్రం భయం లేకుండా.. నింపాదిగా దొంగతనం చేసిన ఆ చెప్పుల దొంగకు సంబంధించిన దృశ్యాలు.. అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే.. ఆ దొంగ.. యువకుడిలాగే కనిపిస్తుండండటంతో.. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చివరికి చెప్పులు, షూలు కూడా వదలటం లేదా.. ఎంతకు దిగజారిపోయార్రా అని ఒకరు కామెంట్ చేయగా.. పాపం వాడు చెప్పులు, షూలు కూడా కొనుక్కోలేకపతున్నాడేమో అని మరోకరు.. వీడు వీటన్నింటిని తీసుకుపోయి.. సెకండ్ హ్యాండ్‌లో ఎవరికో అమ్మేసే గ్యాంగ్ ఉన్నట్టుందంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa