తెలంగాణలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన జారీ చేశారు. పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని.. కొనుగోలు కేంద్రాలు ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాయని చెప్పారు. తెలంగాణ మార్కెటింగ్ శాఖ కార్యదర్శులు, అధికారులు రైతులకు అందుబాటులో ఉండి పూర్తిస్థాయి సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో ఏ ఏడాది 42.23 లక్షల ఎకరాలలో పత్తి సాగవుతోందని మంత్రి తుమ్మల వెల్లడించారు. 25.33 లక్షల టన్నుల ఉత్పత్తిని అంచనా వేస్తున్నట్ల చెప్పారు. అందుకు అనుగుణంగా మార్కెటింగ్ ఏర్పాట్లు చేయాలని వారిని ఆదేశించారు. రైతులకు వాట్సప్ ద్వారా సమాచారం అందించాలన్నారు. రైతులు తమ పంట అమ్మేందుకు ఏ కేంద్రానికి వెళితే త్వరగా విక్రయించుకోవచ్చునో ఆ వివరాలు అన్నదాతలు తెలుసుకునే వెసులుబాటు కల్పించాలని సూచించారు. అమ్మిన పంటకు సంబంధించిన సొమ్ము అన్నదాతల అకౌంట్లలో జమ అయ్యేవరకు వారి వివరాలు తెలుసుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వచ్చేటప్పుడు రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకొని రావాలని సూచించారు. అకౌంట్‌తో అనుసంధానమైన ఫోన్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని రైతులు ధ్రువీకరించిన తర్వాతే బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని చెప్పారు. ఎక్కడా డబ్బులు పక్కదారి పట్టకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేయనన్నట్లు చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా సాయంత్రం అయిదు గంటల వరకే సీసీఐ కేంద్రాలు పనిచేస్తున్నాయన్న మంత్రి తుమ్మల.. తెలంగాణలో మాత్రం గంట అదనంగా సాయంత్రం ఆరు గంటల వరకు నడిపించాలని సీసీఐని ఒప్పించినట్లు చెప్పారు.
పత్తి సాగు చేసిన రైతులు రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. అలా నాణ్యత పాటిస్తే.. ప్రతి క్వింటాలుకు రూ.7,521 మద్దతు ధర పొందే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో ఎక్కడైనా రైతులకు ఇబ్బందులు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల హెచ్చరించారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa