తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. రూ.2 లక్షల వరకు పంట రుణాలను మూడు విడతల్లో అమలు చేశారు. అయితే కొందరు రైతులు అర్హులైనా వారికి రుణమాఫీ వర్తించలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అటువంటి రైతుల కోసం ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. గ్రామాలు, మండల కేంద్రాల్లో వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా దరఖాస్తులు తీసుకుంటున్నారు. సాంకేతిక కారణాల వల్ల కొందరు రైతులకు రుణమాఫీ వర్తించలేదని అటువంటి రైతులకు రైతు రుణమాఫీ వర్తింపజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చెప్పారు.
తాజాగా.. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు తీపి కబురు చెప్పారు. రైతు రుణమాఫీ కానీ రైతుల కోసం మరో రూ.13 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. అర్హులైనా రుణమాఫీ వర్తించని రైతులకు ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. రైతుల సంక్షేమ కోసం బడ్జెట్‌లో రూ.50వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రూ.18 వేల కోట్లతో ఇప్పటికే రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు. మరో రూ.13 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేయాల్సి ఉందని.. వాటిని కూడా త్వరలోనే మాఫీ చేస్తామని తుమ్మల స్ఫష్టం చేశారు.
ఇటీవల వరదలకు పంట నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటున్నామని చెప్పారు. ఆయా రైతుల బ్యాంకు ఖాతాలలో ప్రస్తుతం పరిహారం సొమ్ము ఎకరాకు రూ.10 వేలు జమ చేస్తున్నట్లు చెప్పారు. తాగు, సాగునీటి ఇబ్బందులుండేవని వాటిని పరిష్కరించినట్లు వెల్లడించారు. శక్తి మేర పనులు పూర్తిచేసి దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు. ఇక రైతు భరోసా పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేయనున్నట్లు ఇది వరకే మంత్రి తుమ్మల ప్రకటించారు. పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. రబీ, ఖరీఫ్ సీజన్లు రెండు విడతల్లో రూ.7500 చొప్పున నిధులు జమ చేయనున్నట్లు వెల్లడించారు.
నిధులు పక్కదారి పట్టకుండా కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా పంట పెట్టబడి సాయం అందిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగులోలేని కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు సైతం రైతుబంధు నిధులు విడుదల చేసిందని.. తమ ప్రభుత్వం మాత్రం పారదర్శకంగా కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందిస్తుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. దసరా తర్వాత ఈ పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa