మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోతుందంటూ 'క' సినిమాలో చూపించిన ఊరు నిజంగానే ఉంది.తెలంగాణలోని పెద్దపల్లికి 10K.M దూరంలో ఉన్న మూడుజాముల కొదురుపాక అనే ఊరిలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 జాములే ఉంటాయి. సాయంత్రం 4 గంటలకే అక్కడ చీకటి అవుతుంది. 4 దిక్కులా ఎత్తైన కొండలు, మధ్యలో ఊరు ఉండటంతో సూర్యుడు కొండల వెనక్కి వెళ్లి ఆ నీడ పడి త్వరగా చీకటి అవుతుంది. ఈ ఊరి గురించి మీకు ముందే తెలుసా?
ఎత్తైన గుట్టల మధ్య గ్రామం
చుట్టూ ఎత్తైన గుట్టలు విస్తరించి ఉన్న కొదురుపాక గ్రామానికి ప్రకృతితో విడదీయలేని అనుబంధం ఉంది. శతాబ్దాల క్రితమే వెలిసిన ఈ ఊరు అత్యంత అరుదైన గ్రామాల సరసన నిలుస్తోంది. పాముబండ గుట్ట, గొల్లగుట్ట, రంగనాయకుల గుట్ట, దేవునిపల్లి గుట్ట అని పిలువబడే నాలుగు గుట్టల నడుమ ఈ గ్రామం ఉంది. ఈ గుట్టల కారణంగా కొదురుపాకలో సూర్యోదయం ఆలస్యంగా జరగడం, సూర్యాస్తమయం తొందరగా జరిగిపోతుందట. గుట్టల నీడతో గ్రామంలో చీకటి అలుముకున్నట్టుగా ఉంటుంది.
కొదురుపాక గ్రామానికి కొత్తగా వచ్చే వారు తప్పకుండా ఆశ్చర్యానికి గురవుతుంటారు. సాయంత్రం వేళల్లో కొదురుపాకకు చేరుకునే వారిలో చాలా మంది గందరగోళానికి గురవుతుంటారని గ్రామస్తులు చెబుతున్నారు. మరో గ్రామం నుంచి సాయంత్రం వేళ బయలుదేరినవారు.. గంటలో కొదురుపాక చేరుకున్నా ఇక్కడ చీకట్లు అలుముకోవడాన్ని చూసి ఏం జరుగుతుందో అర్ధంగాక ఆందోళనకు గురవుతుంటారని చెబుతున్నారు.