తెలంగాణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా మరో హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రస్తుతం కాజీపేటలో ఉన్న ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ కేంద్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అప్‌గ్రేడ్ చేయాలని గతేడాది జులై 5వ తేదీన దక్షిణ మధ్య రైల్వే జీఎంకి రైల్వే బోర్డు లేఖ కూడా పంపించింది. అప్‌గ్రేడ్ చేసిన యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌లు తయారు చేసేందుకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని ఈ ఏడాది సెప్టెంబరు 9న రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే.. కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌ల తయారీకి సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని రైల్వే బోర్డు సూచించింది. విభజన హామీల అమలుపై తెలంగాణ అధికారులు, కేంద్ర అధికారులతో హోం శాఖ నిర్వహించిన భేటీలో ఈ విషయాన్ని వెల్లడించింది.
అయితే.. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ.. అనేది ఓరుగల్లు ప్రజల ఎన్నో ఏళ్ల కల. 2014లో రాష్ట్ర విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని కేంద్రం హమీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కోచ్ ఫ్యాకట్రీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో 150 ఎకరాల స్థలాన్ని కేటాయించింది కూడా. అయితే 2017లో దేశంలో ఎక్కడ కూడా కోచ్ ఫ్యాక్టరీల అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయటం ఆ సమయంలో చర్చనీయాంశంగా మారింది. దీనికి విరుద్ధంగా 2018 ఏప్రిల్‌లో మహారాష్ట్రలోని లాతూర్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు రూ.625 కోట్ల బడ్జెట్‌ను కేటాయించటంతో.. తెలంగాణలో కూడా కోచ్ ఫ్యాక్టరీ చేయాల్సిందేనని.. ఒత్తిడి పెరిగంది.
ఈ క్రమంలోనే.. 2023 జూలై 8న కాజీపేటలో 160 ఎకరాల్లో రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. 2025లోగా పూర్తయ్యేలా రూ.521 కోట్లతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ రైల్వే వ్యాగన్ పనులు జరుగుతున్నాయి. కాగా.. ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయటంతో సుమారు 60 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందని అంచనా వేస్తున్నారు.