రంగారెడ్డి జిల్లాలో ఘార రోడుడ ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం ఆలూరి గేటు వద్ద ఓ లారీ అదుపుతప్పి కూరగాయలు అమ్ముకునే వ్యాపారులపై దూసుకువెళ్లింది.ఈ ప్రమాదంలో 10 మంది వ్యాపారులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.వ్యాపారులపైకి దూసుకెళ్లి చెట్టును ఢీకొన్న తర్వాత లారీ ఆగిపోగా.. డ్రైవర్ మాత్రం క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆ చెట్టు కూడా నేలకూలింది. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో సుమారు 50 మంది వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే లారీ వేగంగా రావడం గమనించిన కొందరు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమచారం. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.