కన్నడ నటి శోభిత సూసైడ్ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని శ్రీరామ్ నగర్ కాలనిలో ఓ అపార్ట్‌మెంట్‌లో నవంబర్ 30న రాత్రి ఆమె సూసైడ్ చేసుకుంది. ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మరుసటి రోజు ఉదయం భర్త తలుపులు తెరిచి చూడగా.. ఆమె ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని ఎంక్వైరీ ప్రారంభించారు. అయితే భార్యాభర్తల మధ్య ఎలాంటి విబేధాలు లేవని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది.
శోభిత డిప్రెషన్‌లో ఆత్మహత్య చేసుకుందా..? లేక ఇతర కారణాలతో సూసైడ్ చేసకుందా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భర్త సుధీర్ రెడ్డితో పాటు ఇంటి చుట్టుపక్కల వాళ్ల స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. మ్యాట్రిమోనీ శోభిత ప్రొఫైల్ చూసి సుధీర్ రెడ్డి మ్యారేజ్ ప్రపోజ్ చేసినట్లు తెలిసింది. పెళ్లి తర్వాత ఆమె సీరియల్స్, సినిమాల్లో నటించడం మానేసిన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, శోభిత ఆత్మహత్య చేసుకున్న ఇంట్లో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. అందులో 'మీరు సూసైడ్ చేసుకోవాలని అనుకుంటే యు కెన్ డు ఇట్' అని రాసి ఉంది.
ఆమె ఎవర్ని ఉద్దేశించి అలా రాసారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహ్యతకు మందు ఆమె ఎవరెవరితో మాట్లాడరన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. శోభిత మృతికి డిప్రెషన్ కారణమా..? సీరియల్స్‌కు దూరంగా ఉండటమా..? అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
కన్నడ సినీ పరిశ్రమకు చెందిన శోభిత.. అటు కన్నడతో పాటు ఇటు తెలుగులోనూ పలు సీరియల్స్‌లో నటించారు. బ్రహ్మగంతు, నినిదలే సీరియల్స్ ద్వారా కన్నడలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమాలోనూ నటించింది. సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరైన శోభిత.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న సుధీర్ రెడ్డిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సీరియల్స్, సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇంతలోనే సూసైడ్ చేసుకొని ప్రాణాలు తీసుకుంది.