హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకున్న మహిళా కానిస్టేబుల్‌ను ఆమె తమ్ముడే దారుణంగా హతమార్చినట్లు తెలిసింది. స్కూటీపై వెళ్తున్న ఆమెను.. కారుతో ఢీకొట్టి ఆపై కొడవలితో హతమార్చాడు. స్వగ్రామం రాయపోల్ నుంచి డ్యూటీకి వెళ్తుండగా.. మన్నెగూడ రహదారిపై ఆమెను దారుణంగా హతమార్చారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన నాగమణి 2020లో కానిస్టేబుల్‌గా ఎంపికైంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ప్రస్తుతం ఆమె విధులు నిర్వహిస్తున్నారు.
అయితే అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడిని నాగమణి ప్రేమించింది. కులాలు వేరు కావటంతో ఇంట్లోవాళ్లు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తల్లిదండ్రులను, కుటుంబసభ్యులను ఎదురించి నెల రోజుల క్రితం ప్రేమించిన వాడిని నాగమణి పెళ్లి చేసుకుంది. దీంతో నాగమణి తమ్ముడు, ఇతర కుటుంబ సభ్యులు ఆమెపై కోపం పెంచుకున్నారు. పెళ్లి తర్వాత నాగమణి భర్తతో కలిసి హయత్ నగర్‌లోనే కాపురం పెట్టింది. అయితే ఆదివారం సెలవు దినం కావటంతో నిన్న స్వగ్రామం రాయపోల్ వచ్చింది.
లేడీ కానిస్టేబుల్ కులాంతర వివాహం.. కిరాతకంగా హతమార్చిన తమ్ముడు..!
అనంతరం ఇవాళ ఉదయం స్కూటీపై డ్యూటీకి బయల్దేరింది. మన్నెగూడ రహదారి వద్దకు రాగానే.. వెనుక నుంచి వచ్చిన ఓ కారు నాగమణిని ఢీకొట్టింది. ఈ క్రమంలో నాగమణి స్కూటీ పైనుంచి కిందపడిపోయింది. కారులో నుంచి కిందకు దిగిన యువకుడుకు ఆమెను కొడవలితో కిరాతకంగా హతమార్చాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ నాగమణి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
ప్రేమ వివాహం నేపథ్యంలోనే నాగమణి హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా ఆమె తమ్ముడు పరమేష్‌పై అనుమానం ఉందని ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ వెల్లడించారు. హత్య కేసు నమోదు చేసుకొని అతడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, నాగమణి హత్య విషయం తెలుసుకున్న ఆమె భర్త శ్రీకాంత్ అక్కడకు చేరుకొని బోరును విలపించాడు. ఈ ఘటన అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది.