పటాన్చెరు నియోజకవర్గంలో రహదారులను విస్తరించడంతోపాటు, మరమ్మత్తు పనులకు నిధులు కేటాయించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి ని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. మంగళవారం బంజారాహిల్స్ లోని మంత్రి నివాసంలో కలిసి, వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న పలు రోడ్ల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలు ఉండటంతో పాటు ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటంతో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. దీంతో వివిధ కాలనీల ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న ఇంజనీరింగ్ చదివే విద్యార్ధులు నిత్యం ప్రమాదాలబారిన పడుతున్నారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
పటాన్ చెరు నుంచి శంకర్ పల్లి వరకు ఉన్న డబుల్ లైన్ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించాలని.. ఇందుకోసం 84 కోట్ల రూపాయలు కేటాయించాలని..పటాన్చెరు నుండి ఇంద్రేశం, పెద్ద కంజర్ల మీదుగా బేగంపేట వరకు రహదారి విస్తరణకు 56 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్ధన పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. అతి త్వరలో రహదారుల అభివృద్ధి మరమ్మతులకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తులు, విస్తరణ విషయంలో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతుందని మంత్రి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.