నిజాం రజాకర్లకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజల కడుపు నింపిన పోరాటయోధుడు పండగ సాయన్న అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.పండగ సాయన్న వర్ధంతిని పురస్కరించుకొని చిట్కుల్లోని మత్స్యభవనంలో ఆ మహనీయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఈ పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదని భూస్వాముల నుంచి ఆహార ధాన్యాలు దోచి పేద ప్రజల కడుపు నింపిన మహనీయుడని కొనియాడారు. ఆకలితో అల్లాడుతున్న గ్రామాలలో పండగ సాయన్న అడుగు పెడితే వారి కడుపు నింపి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన ఘనత వల్లే సాయన్న కు పండగ సాయన్న అని పేరు వచ్చిందన్నారు.ముదిరాజ్ కులంలో పుట్టిన ఈ మహానీయుడు బంధుక్ ఎత్తి రజాకర్ల అన్యాయాలను ఎదిరించి ఎదురొడ్డి బహుజనులకు అండగా నిలిచాడని గుర్తు చేశారు. అలాంటి మహావీరుడు స్ఫూర్తితో భవిష్యత్తు తరాలు పోరాటాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.