ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఆశావర్కర్లను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని చాటేలా తాము విజయోత్సవాలు నిర్వహిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు తట్టుకోలేకపోతున్నాయన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఆశా వర్కర్లను రెచ్చగొట్టారని ఆరోపించారు.గత పదేళ్లలో ఆశా వర్కర్ల వేతనాల పెంపుపై ఎన్నిసార్లు నిరసనలు, ధర్నాలు చేసినా పట్టించుకోని బీఆర్ఎస్... ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందన్నారు. బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరికి ఆశా వర్కర్ల నిరసనలే నిదర్శనమన్నారు. 2015లో వేతనాలు పెంచాలంటూ ఆశా వర్కర్లు 106 రోజులు ధర్నా చేశారని గుర్తు చేశారు. కానీ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వారి సమస్యలను పరిష్కరించలేదని విమర్శించారు.అలాంటి వారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో ఆశావర్కర్లు ఆలోచించాలన్నారు. కాస్త సంయమనం పాటించాలని సూచించారు. రాజకీయంగా ప్రేరేపించే వారి ఉచ్చులో పడవద్దన్నారు. తమది ప్రజాప్రభుత్వమని, ఆశా వర్కర్ల స్వేచ్ఛను గౌరవిస్తుందన్నారు.