హైదరాబాద్: తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో చెప్పిన మాటకే తాను కట్టుబడి ఉన్నట్లు రేవంత్ తేల్చి చెప్పారు. ఇవాళ (గురువారం) సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు సహా పలు అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. బెనిఫిట్ షోలు ఉండవని సీఎం చెప్పడంతో కనీసం సంక్రాంతి సినిమాలకైనా అవకాశం ఇవ్వాలని సినీ పెద్దలు కోరగా.. కుదరదని సీఎం తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనను సీఎం ప్రస్తావించారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదని సినీ పెద్దలకు ఆయన స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్‌గా ఉంటామని చెప్పారు. అభిమానుల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని చెప్పారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని వారికి స్పష్టం చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు నరేందర్ రెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, నిర్మాత అల్లు అరవింద్, హీరోలు వెంకటేశ్, నాగార్జున సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అందుకే ఆ పదవి.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "సినీ పెద్దలు చిత్ర పరిశ్రమ సమస్యలను మా దృష్టికి తెచ్చారు. వారి అనుమానాలు, అపోహలు, ఆలోచనలను మాతో పంచుకున్నారు. ఎనిమిది సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చింది. పుష్ప సినిమాకు పోలీస్ గ్రౌండ్ ఇచ్చాం. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పరిశ్రమ బాగుండాలని కోరుకున్నాం. ఐటీ, ఫార్మాతోపాటు చిత్ర పరిశ్రమా మాకు ముఖ్యం. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశాం. ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండేందుకు దిల్ రాజును ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించాం. పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. సినీ పరిశ్రమ సైతం కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఇబ్బంది పెట్టొద్దు.. తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకుని హైదరాబాద్‌కు రెండు గంటల్లో రావొచ్చు. రాష్ట్రంలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయండి. టెంపుల్ టూరిజానికి సహకరించండి. ఇక మీదట ఆలయాల్లో షూటింగ్స్ చేసుకోండి. ప్రభుత్వం సగటు ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తుంది. ప్రేక్షకుడికి అందుబాటులో సినిమా ఉండాలి. టికెట్ ధరలు ప్రేక్షకులు చూసే విధంగా ఉండాలి. ధరల పెంపునకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దు. సినిమా రంగానికి ప్రభుత్వ సహకారం ఉంటుంది. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుపై మా విధానాన్ని ఇప్పటికే ప్రకటించాం. దానిపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేం. మా ప్రభుత్వం పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. సహకరించండి.. గంజాయి, డ్రగ్స్‌తోపాటు సామాజిక అంశాలపైనా సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలి. పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాం. సినీ పరిశ్రమను ప్రోత్సాహించడమే మా ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నాది. నాకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవు. తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దాం. ముంబైలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడింది. గ్రాండ్‌గా సదస్సు.. కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు ఉండాలి. హైదరాబాద్‌లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. పరిశ్రమను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లడమే మా ఉద్దేశం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నాం. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి నైపుణ్యాలను పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. 140 కోట్ల జనాభా ఉన్న దేశం ఒలింపిక్స్‌లో పతకాలు తెచ్చుకోలేకపోతోంది. స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని" చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa