తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నాళ్లు దర్యాప్తు చేస్తారని, నెలల తరబడి కొనసాగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, దర్యాప్తు పూర్తయ్యే వరకూ నిందితులు జైల్లోనే ఉండాలనడం భావ్యం కాదని, ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యనించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న మాజీ ఏఎస్పీ తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ఆయన పాత్రపై దర్యాప్తు ఎప్పటిలోపు పూర్తిచేస్తారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి రెండు వారాల సమయం కావాలని విజ్ఞప్తి చేయడంతో ఈ నెల 27కు విచారణ వాయిదా వేసింది. ఈలోగా పూర్తి వివరాలతో కూడిన అఫిడివిట్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. తన క్లయింట్ గత 9 నెలలుగా కస్టడీలోనే ఉన్నారని, దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతోందని ధర్మాసనానికి తెలిపారు. దర్యాప్తు తీరు చూస్తే మరో నాలుగైదేళ్లు జైల్లోనే ఉండాల్సి వస్తుందేమోనని, గతంలో పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను దృష్టిలో ఉంచుకొని బెయిల్ ఇవ్వాలని కోరారు. దీనిపై సిద్ధార్థ లూథ్రా అభ్యంతరం తెలుపుతూ.. నిందితుడు హైకోర్టు జడ్జిలను కూడా వదిలిపెట్టకుండా అందరి ఫోన్లూ ట్యాప్‌చేశారని అన్నారు. ఈ కేసులో తవ్వేకొద్ది విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. దర్యాప్తు కీలక దశలో ఉన్న తరుణంలో అతడు బయటికొస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు.
అతడి వాట్సప్ డేటా సమాచారం కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయిస్తే.. ఇంతవరకూ దానికి సమాధానం ఇవ్వకుండా కాలయాపనచేస్తున్నారని ఆరోపించారు. పిటిషనర్ స్పందించని కారణంగానే దర్యాప్తులో జాప్యం జరుగుతోందని అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న జోక్యంచేసుకుంటూ.. ‘‘హైకోర్టు సుమోటోగా తీసుకున్న ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్, డేటాను మాయంచేయడం ఈ రెండు ప్రధాన ఆరోపణలు ఉన్నాయి... ఇదివరకున్న ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పిటిషనర్ నడుకున్నాడు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారుతుందని గ్రహించి స్వీయ రక్షణ కోసం డేటాను మాయం చేశాడు.. వ్యక్తిగత డివైజ్‌లలోకి నిఘా డేటాను బదిలీ చేశాడు... దీన్ని సాధారణ కేసుల్లా పరిగణించడానికి వీల్లేదు. ఈ కేసులో సాక్ష్యాలను సంరక్షించడం అత్యంత కీలకం.. నిందితుడు బయటికొస్తే సాక్ష్యాలను తారుమారుచేసే అవకాశం ఉండదా..?’ అని నిందితుడు తరఫు లాయర్ సిద్ధార్థ దవేని ప్రశ్నించారు.
దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్దమని చెబుతున్నప్పుడు డేటా ఉందా? లేదా? అనేది అప్రస్తుతమన్నారు. డేటా మాయం కేసులో పిటిషనర్ పాత్ర గురించి ఎక్కడా పేర్కొనలేదని వివరించారు. అంతేకాదు, ప్రభుత్వం మారిన తర్వాత పరారైన వ్యక్తిని వెనక్కి రప్పించలేక నెలలుగా జైల్లో ఉంచారని, ఇందులో సెక్షన్ 409 తప్పితే మిగిలినవి తీవ్రమైనవి కావన్నారు. ఈ సందర్భంగా పిటిషనర్ పాత్రపై దర్యాప్తు ఎప్పటిలోపు పూర్తిచేస్తారో? తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగి చెప్పాలని సిద్ధార్థ లూథ్రాను జస్టిస్ నాగరత్న కోరారు. సాక్ష్యాలను భద్రంగా ఉంచడం అత్యంత ముఖ్యమని, ఇక్కడ ఇరుపక్షాల ప్రయోజనాల మధ్య సమతౌల్యత పాటించాలని వ్యాఖ్యానించారు. ఇందులో వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఇమిడి ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa