కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, పెంచికల్‌పేట్ మండలం, లోడ్‌పల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఒక విషాద ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదన నింపింది. అడవిలో ఉన్న విషపు చెట్లను (పంచపూల మొక్కల్ని) తిని సుమారు తొంభై గొర్రెలు మృత్యువాత పడ్డాయి. కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు తమ గొర్రెలను మేత కోసం లోడ్‌పల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తమ జీవనాధారం కోల్పోయిన ఆ గొర్రెల రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఇక ప్రమాదం నుండి బయటపడిన మరికొన్ని గొర్రెలు అస్వస్థతకు గురికాగా, పశువైద్యులు వాటికి చికిత్స అందిస్తున్నారు.
నిజానికి.. గొర్రెలు తిన్న ఈ మొక్కలు మనకు తెలియనివి కావు. గ్రామీణ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో విరివిగా కనిపించే ఈ మొక్కను స్థానికంగా 'పులి కంప' అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం లాంటానా కామరా. గుత్తులు గుత్తులుగా అందమైన పూలతో ఆకర్షణీయంగా కనిపించే ఈ మొక్క, వాస్తవానికి చాలా ప్రమాదకరమైనది.
ఈ మొక్క అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. దీని జన్మస్థలం అమెరికా కాగా, బ్రిటిష్ వారు దీన్ని భారతదేశానికి తీసుకువచ్చారు. అప్పటి నుండి ఈ మొక్క దేశవ్యాప్తంగా విస్తరించి, వాడుకలో లేని.. నిర్లక్ష్యం చేయబడిన నేలల్లో ఎక్కువగా పెరిగిపోతోంది. ఈ మొక్కలో ఉండే విష పదార్థాలు పశువులకు, ముఖ్యంగా మేకలు, ఆవులకు ప్రాణాంతకం. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. ఈ మొక్కను తిన్న పశువులకు కాలేయం దెబ్బతిని (లివర్ డ్యామేజ్) మరణించే ప్రమాదం ఉంది.
లాంటానా కామరా కేవలం విషపూరితం కాకుండా, ఇది ఇతర స్థానిక మొక్కల పెరుగుదలను అడ్డుకుంటుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో పశువులకు మేతగా ఉపయోగపడే ఇతర మొక్కలు లభించవు. ఆకలికి తట్టుకోలేక, గత్యంతరం లేని పరిస్థితుల్లో పశువులు ఈ విషపూరితమైన మొక్కను తిని ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇది జీవవైవిధ్యాన్ని దెబ్బతీయడంతో పాటు, అటవీ ప్రాంతాల సహజ వృక్షజాలానికి ముప్పుగా మారుతోంది.
లాంటానా కామరా కేవలం పశువులకే కాదు, మానవులకు కూడా ప్రమాదకరమైనదేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పొరపాటున ఈ మొక్క భాగాలను తింటే, మానవులలో కూడా మూత్రపిండాలు పూర్తిగా పాడైపోయి (కిడ్నీ ఫెయిల్యూర్) మరణించే ప్రమాదం ఉందని పరిశోధనలలో తేలింది. ఈ మొక్క విస్తరణను నియంత్రించడం, పశువుల మేత కోసం ప్రత్యామ్నాయాలను చూపించడం, అలాగే ప్రజల్లో దీని ప్రమాదాలపై అవగాహన కల్పించడం అత్యవసరం. అధికారులు, అటవీ శాఖ, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో పనిచేసి ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా చూడాలి. లేకపోతే, రైతులు తమ జీవనాధారాన్ని కోల్పోవడం, పర్యావరణానికి నష్టం జరగడం కొనసాగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa