మనిషి కోరికలు విచిత్రంగా ఉంటాయి. కొనుగోలు చేయడానికి డబ్బులు ఉన్నప్పటికీ.. ఉచితంగా ఏదైనా వస్తువు లభిస్తుందంటే లేదా ఆఫర్లలో వస్తుంటే వాటి పట్ల అపరిమిత ఆసక్తి చూపుతారు. అవసరం లేకున్నా తీసుకోవడానికి ఆరాటపడతారు. ఇది మానవ సహజ స్వభావం. వ్యాపారులు ఈ మనస్తత్వాన్నే తమ వ్యాపారానికి అస్త్రంగా వాడుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోనూ.. ఇతర ప్రాంతాల్లోనూ ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయి.
తాజాగా.. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రజల ఆసక్తికి అద్దం పట్టే సంఘటన జరిగింది. అక్కడి కాసం షాపింగ్ మాల్‌లో కేవలం రూ.35కే చీర ఆఫర్ ప్రకటించడంతో స్థానిక మహిళలు భారీ సంఖ్యలో పోటెత్తారు. ఉదయం షాపింగ్ మాల్ తెరవకముందే వందలాది మంది మహిళలు బారులు తీరారు. ఇంట్లో పనులను కూడా పక్కనపెట్టి మరీ, షాపింగ్ మాల్ దగ్గర క్యూలైన్‌లో నిలబడ్డారు. షాపు తెరవకముందే ఇంతమంది మహిళలు గుమిగూడటం చూసి ఆ మార్గంలో వెళ్లేవారు ఆశ్చర్యపోయారు. గతంలో హైదరాబాద్‌లో కూడా కిరాణా షాపుల ప్రారంభోత్సవాల్లో ఉచితంగా కూరగాయలు పంపిణీ చేయగా, వాటి కోసం జనం ఎగబడటం గమనార్హం. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతుంటాయి.
వ్యాపారులు ఆఫర్లను ప్రకటించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా.. ఇది వినియోగదారులను ఆకర్షించడానికి ఒక ప్రభావవంతమైన మార్గం. తక్కువ ధరకు వస్తువులు లభిస్తున్నాయనే ఆలోచన ప్రజలను షాపులకు రప్పిస్తుంది. దీనివల్ల.. అమ్మకాలు పెరుగుతాయి. ఆఫర్ల ద్వారా ఎక్కువమంది వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేస్తారు, తద్వారా మొత్తం అమ్మకాలు పెరుగుతాయి. అంతే కాకుండా.. ఆఫర్లు కొత్త వినియోగదారులను షాపులోకి రప్పిస్తాయి. వారు భవిష్యత్తులో కూడా ఆ షాపులో కొనుగోళ్లు చేయడానికి అలవాటు పడవచ్చు.
తక్కువ అమ్ముడైన వస్తువులు లేదా పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి ఆఫర్లు సహాయపడతాయి. ఆఫర్లు, డిస్కౌంట్లు తరచుగా ఇచ్చే షాపులు వినియోగదారుల దృష్టిలో "తక్కువ ధరలకు మంచి వస్తువులు" అందించేవిగా గుర్తింపు పొందుతాయి. మార్కెట్‌లో ఉన్న పోటీని తట్టుకోవడానికి, తమ వినియోగదారులను నిలుపుకోవడానికి ఆఫర్లు అవసరంగా వారు భావిస్తారు. ఈ విధంగా ఆఫర్లు వ్యాపారులకు అమ్మకాలను పెంచడానికి, కస్టమర్ బేస్‌ను విస్తరించడానికి, బ్రాండ్‌ను బలోపేతం చేయడానికి ఒక కీలకమైన సాధనంగా పనిచేస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa