జగిత్యాలలో కిడ్నాప్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమకు ఇష్టం లేకుండా కుమార్తె లవ్ మ్యారేజ్ చేసుకుందని తీవ్ర ఆగ్రహంతో ఉన్న తల్లిదండ్రులు.. ఆమె ప్రెగ్నెంట్ అని తెలుసుకుని మరింత కోపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆమెను ఆస్పత్రిలో చెకప్ కోసం తీసుకెళ్లి.. కిడ్నాప్ చేయాలని భావించారు. కానీ ఆ విషయం తెలుసుకున్న వారి కుమార్తె.. తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఆ తర్వాత తన తల్లిదండ్రులపైనే ఆమె ఫిర్యాదు చేసింది. తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులు, బావ నుంచి తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్‌కు చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజక్కపల్లి గ్రామానికి చెందిన మర్రి రాకేష్ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో ప్రియాంక తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో ఈ ఏడాది జులై 27వ తేదీన ప్రియాంక ఇంట్లో నుంచి వెళ్లిపోయి రాకేష్‌ను పెళ్లి చేసుకుంది. రాకేష్ తల్లిదండ్రులు ఓ గుడిలో వీరికి పెళ్లి జరిపించారు.
పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులకు తన తల్లి తనకు ఫోన్ చేసి బాగానే మాట్లాడిందని.. మంచిగా బతకండి బిడ్డా అని చెప్పిందని ప్రియాంక చెప్పింది. మంచిగా ఉన్నట్లు నటించి తనను తన భర్త నుంచి వేరుచేసి తీసుకెళ్లిపోయేందుకు కుట్ర చేశారని ఆరోపిస్తోంది. 2 నెలల కిందట తాను గర్భం దాల్చానని.. ఆ విషయాన్ని తల్లికి చెప్పగా.. ఆస్పత్రికి తాను కూడా వస్తానని చెప్పిందని ప్రియాంక తెలిపింది.
ఆస్పత్రిలో డాక్టర్‌ను కలిసి తిరిగి వస్తుండగా.. వాష్ రూమ్ వస్తోందంటూ తన తల్లి.. తన అత్తను తీసుకొని వెళ్లిందని.. అదే సమయంలో తన తండ్రి, తన అక్క భర్త (బావ) కలిసి కారులో వచ్చి తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని చెప్పింది. స్థానికుల సాయంతో తప్పించుకొని 100కు డయల్ చేసి పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపింది. తన తల్లే తనను నమ్మించి.. మోసం చేసిందని.. మంచిగా బతుకమని చెప్పి తమకు దగ్గరై ఇలా చేసిందని ఆరోపించింది.
తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించడమే కాకుండా.. చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసింది. తన తల్లిదండ్రులు, బావ, కుటుంబ సభ్యులతో తన భర్తకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa