కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మంత్రి సీతక్కతో కలిసి నిర్వహించిన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి మహిళకు చీర అందేలా చూడాలని అధికారులకు సూచించారు. చీరలను సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తుండటం వల్ల ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో, పంపిణీని రెండు దశల్లో చేపట్టాలని సీఎం ఆదేశించారు. తొలి దశలో, బుధవారం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించి, డిసెంబరు 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. రెండో దశలో, మార్చి 1 నుంచి మార్చి 8 (అంతర్జాతీయ మహిళా దినోత్సవం) వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ పూర్తి చేయాలన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా మహిళలకు నాణ్యమైన చీరలను అందించాలని, అలాగే సాంకేతికతను వినియోగించుకుని పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాలని, ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఈ పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం సెక్రటేరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంత మహిళలతో మాట్లాడనున్నారు; ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న కలెక్టరేట్ల నుంచి వీడీయోకాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని కూడా ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa