ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు ..?. ప్రభుత్వం క్లారిటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 23, 2025, 08:55 PM

తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించిన వేళ.. ఉప సర్పంచుల చెక్ పవర్ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా , కొన్ని వార్తా సంస్థల్లో ఉప సర్పంచుల అధికారాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసిందనే వార్తలు వచ్చాయి. అయితే.. దీని వెనుక ఉన్న అసలు వాస్తవాలు, ప్రభుత్వం జారీ చేసిన మెమోలోని అంతరార్థం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం అవసరం.


రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు, మండలాలకు సంబంధించి ఒక అధికారిక మెమోను విడుదల చేసింది. ఈ మెమో ప్రధానంగా 15వ ఆర్థిక సంఘం నిధుల నిర్వహణకు సంబంధించింది. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను జమ చేయడానికి ప్రతి పంచాయతీలో ఒక ప్రత్యేక ఖాతాను తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది.


ఈ ప్రత్యేక ఖాతా నుండి నగదు ఉపసంహరణ లేదా చెల్లింపులు జరపాలంటే.. పంచాయతీ కార్యదర్శి (లేదా ఎంపీడీఓ) అండ్ సర్పంచ్ (లేదా ఎంపీపీ) ల డిజిటల్ సంతకాలు తప్పనిసరి అని పేర్కొంది. ఈ మెమోలో ఎక్కడా 'ఉప సర్పంచ్' పేరు ప్రస్తావించకపోవడంతో.. అది వారి అధికారాన్ని రద్దు చేసినట్లుగా అధికారుల మధ్య , మీడియాలో ప్రచారమైంది.


వాస్తవానికి.. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం సాధారణ నిధుల వినియోగంలో ఉప సర్పంచ్‌కు ఉన్న ఉమ్మడి సంతక అధికారం ఇంకా అమలులోనే ఉంది. ప్రభుత్వం ఇప్పుడు చేసిన మార్పు కేవలం కేంద్ర నిధుల నిర్వహణ , డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను సరళీకృతం చేయడం కోసమే అని తెలుస్తోంది. గ్రామ పంచాయతీకి వచ్చే పన్నులు, ఇతర ఆదాయాలకు సంబంధించి పాత పద్ధతిలోనే జాయింట్ చెక్ పవర్ కొనసాగుతుందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.


ప్రభుత్వం ఈ మెమో ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం కేవలం నిధుల వినియోగంలో జాప్యాన్ని తగ్గించడమే. గతంలో సర్పంచ్, ఉప సర్పంచుల మధ్య గొడవల వల్ల నెలల తరబడి నిధులు వాడకుండా నిలిచిపోయేవి. డిజిటల్ సంతకాల ప్రక్రియలో కీలకమైన ఇద్దరు వ్యక్తులే ఉండటం వల్ల పనులు వేగంగా జరుగుతాయి.


ఒకవేళ ఉప సర్పంచుల అధికారం నిజంగానే తగ్గిపోతే.. గ్రామ పాలనలో సర్పంచ్‌ల ఆధిపత్యం పెరిగే అవకాశం ఉంటుంది. వార్డు సభ్యుల నుండి ఎన్నికైన ఉప సర్పంచ్‌కు నిధులపై పర్యవేక్షణ లేకుండా పోతుంది. ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం పాత చట్టాన్ని పూర్తిగా సవరించి ఉప సర్పంచులను తొలగించినట్లు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa