ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు..తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 23, 2025, 09:06 PM

తెలంగాణ రాష్ట్ర పాలనా యంత్రాంగంలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. 2026 నూతన సంవత్సరానికి ముందే ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు గవర్నర్ ఆదేశాల మేరకు ఈ నియామకాలను ఖరారు చేశారు. ఈ మార్పులు రాష్ట్ర పరిపాలనను మరింత బలోపేతం చేయడమే కాకుండా.. కీలక శాఖల్లో అనుభవజ్ఞులైన అధికారులకు ఉన్నత బాధ్యతలను అప్పగించాయి.


రాష్ట్రంలో సుదీర్ఘ అనుభవం ఉన్న 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం అపెక్స్ స్కేల్ (లెవల్-17) కేటాయించింది. ఇది ఐఏఎస్ సర్వీసులో అత్యున్నత స్థాయి హోదాగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఇంధన శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న నవీన్ మిట్టల్ అదే శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ చీఫ్ సెక్రటరీ) గా పదోన్నతి పొందారు. విద్యుత్ రంగాన్ని పటిష్టం చేయడంలో ఆయన చేసిన కృషికి ఈ పదోన్నతి గుర్తింపుగా నిలిచింది. కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న దాన కిశోర్ ని కూడా అదే శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. నగర పాలన, వివిధ సంక్షేమ శాఖల్లో ఆయనకున్న పట్టు రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుముకగా నిలవనుంది. ఈ ఇద్దరు అధికారులు 2026 జనవరి 1వ తేదీ నుండి లేదా వారు బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఈ హోదాలో కొనసాగుతారు. అపెక్స్ స్కేల్ అనేది కేబినెట్ సెక్రటరీ స్థాయికి ఇంచుమించు సమానమైన జీతభత్యాలు, అధికారాలను కలిగి ఉంటుంది.


ఐపీఎస్ అధికారులకు డీఐజీ హోదా..


పోలీస్ విభాగంలో కూడా ప్రభుత్వం భారీగా పదోన్నతులు కల్పించింది. 2012 బ్యాచ్ కు చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులను డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  స్థాయికి ఎంపానెల్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదోన్నతి పొందిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్. శ్వేత.. హైదరాబాద్ నగరంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా కొనసాగుతూనే డీఐజీ హోదాను పొందారు.


ఆర్. భాస్కరన్.. ప్రస్తుతం సివిల్ ఇంటెలిజెన్స్ విభాగంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఉన్న ఈయనకు డీఐజీ స్థాయి లభించింది. జి. చందన దీప్తి.. సికింద్రాబాద్ రైల్వే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్న ఈమెకు పదోన్నతి కల్పించారు. కల్మేశ్వర్ శింగెనవర్.. శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఈయనను డీఐజీ స్థాయికి ప్రమోట్ చేశారు. ఎస్.ఎం. విజయ్ కుమార్.. సిద్దిపేట పోలీస్ కమిషనర్‌గా ఉన్న ఈయనకు పదోన్నతి లభించింది. రోహిణి ప్రియదర్శిని.. ఈమెకు కూడా డీఐజీ హోదాను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ అధికారులందరూ కూడా 2026 జనవరి 1వ తేదీన కొత్త హోదాతో బాధ్యతలు స్వీకరిస్తారు. పోలీసు వ్యవస్థలో ఎస్పీ స్థాయి నుండి డీఐజీ స్థాయికి పదోన్నతి అనేది ఒక ముఖ్యమైన మైలురాయి. వీరు ఇకపై జిల్లా స్థాయి పర్యవేక్షణే కాకుండా రేంజ్ స్థాయి బాధ్యతలను కూడా స్వీకరించే అవకాశం ఉంటుంది. అధికారుల గత ఐదేళ్ల పనితీరు, వారి సమర్థత, సర్వీస్ రికార్డులను పరిశీలించి డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటుంది. సీనియర్ అధికారులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా ఇవ్వడం ద్వారా విధాన నిర్ణయాల అమలు వేగవంతం అవుతుంది. అలాగే యంగ్ ఐపీఎస్ అధికారులకు డీఐజీ హోదా ఇవ్వడం వల్ల శాంతిభద్రతల పర్యవేక్షణలో కొత్త ఉత్సాహం వస్తుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa