ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న హైడ్రా కార్యాలయంలో సోమవారం ఒక అరుదైన, స్ఫూర్తిదాయకమైన సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా పనులు పూర్తి చేసిన అధికారులను ప్రజలు సన్మానించడం చూస్తుంటాం.. కానీ ఇక్కడ కమిషనర్ ఏవీ రంగనాథ్ బాధితులనే సన్మానించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా పరిధిలోని దుండిగల్ మున్సిపాలిటీలో 'డాలర్ మెడోస్' కాలనీ ఉంది. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ లేఅవుట్లో 250 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.
అయితే.. అక్కడి ఐదు ఎకరాల భూమిని అభివృద్ధి చేస్తున్న ఒక వ్యక్తి.. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్ రహదారిని ప్రహరీ గోడ కట్టి మూసేశారు. దీనివల్ల కాలనీ నివాసితులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ అన్యాయంపై కాలనీ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా.. హైడ్రా విభాగం తక్షణమే స్పందించింది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, అక్రమ కట్టడాలను తొలగించి ప్రజలకు రహదారిని పునరుద్ధరించారు.
ఈ విజయానికి గుర్తుగా కాలనీవాసులు సోమవారం హైడ్రా కార్యాలయానికి చేరుకున్నారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ కి మిఠాయిలు తినిపించి.. శాలువాతో సత్కరించాలని వారు భావించారు. కానీ రంగనాథ్ వారి విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించి.. రివర్స్ సన్మానం చేశారు. తన హక్కుల కోసం పోరాడి విజయం సాధించిన కాలనీ ప్రతినిధులను కమిషనర్ స్వయంగా శాలువాలతో సత్కరించారు. ‘అక్రమాలను సహించకుండా నిలబడిన మీరే నిజమైన హీరోలు, మీరు మరికొందరికి ఆదర్శం’ అని ఆయన ప్రశంసించారు.
ఈ సమస్య పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించిన హైడ్రా ఇన్స్పెక్టర్ నరేష్‌ను కూడా కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజల మధ్య సమన్వయం ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ ఘటన నిరూపించింది. రహదారి ఆటంకాలు తొలగిన వెంటనే దుండిగల్ మున్సిపాలిటీ అధికారులు అక్కడ సిమెంట్ రోడ్డు నిర్మించి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచారు. ఆక్రమణలపై మౌనంగా ఉండకుండా.. చట్టబద్ధమైన మార్గాల్లో అధికారులను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ఈ ఉదంతం ప్రజల్లో పెంచింది. డాలర్ మెడోస్ కాలనీవాసులు ప్రదర్శించిన ఈ చైతన్యం ఇతర ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి ఒక దిక్సూచిగా మారుతుందని హైడ్రా కమిషనర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa