వీధి కుక్కల సంఖ్య పెరుగుదల, వాటితో మనుషులకు జరుగుతున్న సంఘర్షణపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విషయమై సుప్రీం కోర్టులో కూడా విచారణ నడుస్తోంది. అయితే వీధి కుక్కల నియంత్రణ శాస్త్రీయ పద్ధతుల్లోనే చేపట్టాలి. కానీ కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. మూగజీవాల ఉసురుతీస్తున్నారు. పాశవిక పద్ధతుల్లో వాటి ప్రాణాలు తీస్తున్నారు. 2025 డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలోని ఓ గ్రామంలో 250కు పైగా వీధి కుక్కలకు విషం ఇచ్చి చంపేశారు. ఈ ఘటన మరువక ముందే.. తెలంగాణలో మరో దారుణం జరిగింది. కామారెడ్డి జిల్లాలో కొన్ని గ్రామాల పరిధిలో 600లకు పైగా వీధి కుక్కలను చంపిన ఘటన కలకలం రేపింది.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో 600కు పైగా వీధి కుక్కలు మృత్యువాత పడ్డాయి. పాల్వంచ మండల కేంద్రంతో పాటు ఫరీద్‌పేట, బండరామేశ్వర్‌పల్లి, భవానీపేట, వాడి గ్రామాల్లో కుక్కలను చంపేశారు. అయితే ఇటీవల ఎన్నికైన సర్పంచ్‌లు అత్యుత్సాహంతో మానవత్వం మరిచి.. విషంతో వీధి కుక్కలను చంపేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం తెలిసి జంతు ప్రేమికులు, జంతు హక్కుల కార్యకర్తలు భగ్గుమన్నారు. ఒకేసారి భారీ సంఖ్యలో కుక్కలు మృతి చెందడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ప్రతినిధులు ఐదు గ్రామాల్లో విచారణ జరిపినట్లు.. కుక్కలను చంపింది నిజమేనని నిర్ధారించుకున్నట్లు తెలిసింది. అనంతరం ఆధారాలతో మాచారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
జంతు హక్కుల సంస్థ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు . ఈ క్రమంలో చంపేసిన కుక్కలను గ్రామ శివారుల్లో పాతిపెట్టారనే సమాచారంతో పోలీసులు, పశువైద్యాధికారులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం వాటి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఈ దారుణ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
వీధి కుక్కల నియంత్రణ కోసం.. జంతు సంరక్షణ చట్టాల ప్రకారం సంతానోత్పత్తి నియంత్రణ (యానిమల్ బర్త్ కంట్రోల్) వంటి శాస్త్రీయ పద్ధతులను పాటించాలి. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను మాత్రమే పాటించాలి. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, టీకాలు వేయించాలి. అంతేగానీ వాటిని నిర్దాక్షిణ్యంగా చంపకూడదు. సుప్రీం కోర్టు కూడా పలు సందర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వీధి జంతువులను చంపడం అనేది క్రమినల్ నేరం. అందుకు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా పడే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa