హైదరాబాద్ నగరంలో నకిలీ మెహందీ కోన్ల తయారీ, విక్రయాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 13వ తేదీ మంగళవారం నాడు హైదరాబాద్‌లోని మినార్ కాలనీ, బాలాపూర్ , అఫ్జల్‌గంజ్ ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రముఖ బ్రాండ్ అయిన 'కరాచీ మెహందీ' పేరుతో నకిలీ కోన్లను తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో మొహమ్మద్ ఆసిఫ్ (తయారీదారు), దీపక్ కుమార్ (హోల్‌సేల్ వ్యాపారి) ఉన్నారు. వీరి నుంచి సుమారు 8 లక్షల రూపాయల విలువైన నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
మోసం జరిగిందిలా..
నిందితుడైన ఆసిఫ్ వృత్తిరీత్యా వడ్రంగి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో మెహందీ తయారీని ప్రారంభించాడు. మొదట్లో ఏ బ్రాండ్ పేరు లేకుండా సాధారణంగా అమ్మేవాడు. అయితే ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడంతో.. మార్కెట్‌లో మంచి ఆదరణ ఉన్న 'కరాచీ మెహందీ' పేరును వాడుకోవడం మొదలుపెట్టాడు. నకిలీ ప్యాకింగ్‌తో వీటిని అసలు వస్తువులుగా నమ్మించి ప్రజలను మోసం చేశారు.
ఈ దాడుల్లో పోలీసులు మెహందీ పొడిలో కలిపేందుకు సిద్ధంగా ఉంచిన 5 కిలోల ఆక్సాలిక్ యాసిడ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా మెహందీ కోన్లు త్వరగా పండటానికి, గాఢమైన రంగు రావడం కోసం ఇలాంటి ప్రమాదకరమైన రసాయనాలను వాడుతుంటారు. నకిలీ మెహందీ వాడటం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద, ఎర్రగా కందిపోవడం వంటి సమస్యలు వస్తాయి. యాసిడ్ వంటి రసాయనాల వల్ల చర్మం కాలిపోయి శాశ్వత మచ్చలు పడే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఈ రసాయనాల వల్ల శ్వాసకోస ఇబ్బందులు లేదా తీవ్రమైన అలెర్జీలు రావచ్చు.
అసలు బ్రాండ్ ధర కంటే చాలా తక్కువ ధరకే వస్తుంటే అది నకిలీ అయ్యే అవకాశం ఉండే అవకాశం ఉందని.. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతే కాకుండా.. బ్రాండ్ లోగో, స్పెల్లింగ్ తప్పులు, ప్యాకింగ్ నాణ్యతను గమనించాలన్నారు. ఘటైన రసాయన వాసన వస్తుంటే అటువంటి కోన్లను వాడకపోవడమే మంచిదని పేర్కొన్నారు. లాభార్జనే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే ఇలాంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa