రాష్ట్రంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఘన విజయం సాధించి, అన్ని పట్టణాలపై గులాబీ జెండా ఎగరవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు, మున్సిపల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్లలోనే ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన ద్రోహం, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమై ప్రజలను మోసం చేసిన తీరు అందరికీ స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌కు అనుకూల వాతావరణం నెలకొందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.రానున్న వారం రోజుల పాటు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తే భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని కేటీఆర్ తెలిపారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ముందు ప్రతిపక్షాలు నిలవలేకపోయాయని, అప్పట్లో కాంగ్రెస్, బీజేపీలు కేవలం ఏడెనిమిది స్థానాలకే పరిమితమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఎన్నికల వ్యూహంలో సమన్వయం అత్యంత కీలకమని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ విజ్ఞప్తిని మన్నించి నామినేషన్లు ఉపసంహరించుకున్న రెబల్ అభ్యర్థులను సాదరంగా ఆహ్వానించి, వారిని ప్రచారంలో భాగస్వాములను చేయాలని సూచించారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి త్యాగం చేసిన ప్రతి నాయకుడికి తగిన గౌరవం ఇవ్వాలని, అభ్యర్థులు స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి కలవాలని ఆదేశించారు. ఈ బాధ్యత మున్సిపల్ కోఆర్డినేటర్లపై ఉందని తెలిపారు.నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదికను వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని సూచించారు. చివరి దశ అయిన ప్రచారంపై పూర్తి దృష్టి పెట్టాలని, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో విజయావకాశాలను అంచనా వేసి, గెలుపు దిశగా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. అభ్యర్థుల గెలుపుతో పాటు పోలింగ్ రోజున ఓటింగ్ శాతం పెంచడంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు మున్సిపల్ కోఆర్డినేటర్లు తమకు కేటాయించిన క్షేత్రాల్లోనే అందుబాటులో ఉండాలని కేటీఆర్ ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa