ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 లో 5 కారిడార్లు, 76.4 కిలోమీటర్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 04, 2026, 07:02 PM

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై బిగ్ అప్‌డేట్ వచ్చింది. మెట్రో విస్తరణలో భాగంగా రెండో దశలో మొత్తం 76.4 కిలోమీటర్ల మేర కొత్త మార్గం నిర్మించనున్నారు. హైదరాబాద్ నగరవాసులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంతోపాటు.. నగరంలోని మరిన్ని ప్రాంతాలకు మెట్రో రైలును విస్తరించేందుకు ఈ హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మెట్రో విస్తరణ జరిగితే.. లక్షలాది మంది నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. మెట్రో ఫేజ్-2కు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ తాజాగా ఒక ప్రకటనను రిలీజ్ చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.24,269 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.


ఈ హైదరాబాద్ మెట్రో ఫేజ్-2లో భాగంగా కొత్తగా మరో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాలు ఏర్పాటు కానున్నాయి. ఇక ఈ మెట్రో ఫేజ్-2 నిర్మాణానికి ఇప్పటికే తెలంగాణ సర్కార్.. పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన రిపోర్ట్‌ను కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఇక ఈ మెట్రో ఫేజ్-2 నిర్మాణం కోసం కావాల్సిన 2787 ఎకరాల భూమిని సేకరించేందుకు ఈ ఏడాది జనవరిలోనే రాష్ట్ర మంత్రివర్గం భారీగా నిధులు కూడా మంజూరు చేసింది.


నాగోల్-శంషాబాద్ కారిడార్


మరోవైపు.. ఈ రెండో దశలో 5 కొత్త కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. నాగోల్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వరకు 36.6 కిలోమీటర్ల మేర కొత్తగా మెట్రో రైలు పరుగులు తీయనుంది. ఈ మార్గంలో 24 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులు.. రోడ్లపై ఉండే ట్రాఫిక్‌ భయం లేకుండా మెట్రోలోనే ఎయిర్‌పోర్టుకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ నాగోల్-శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గంలో ఎక్కువ భాగం ఎలివేటెడ్ మార్గాన్నే నిర్మించనుండగా.. కొంత భాగం భూగర్భంలో 1.6 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు.


 మరోవైపు.. రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు మరో కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. 11.6 కిలోమీటర్ల ఈ మార్గంలో మొత్తం 8 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ రాయదుర్గం- కోకాపేట్ నియోపోలిస్ కారిడార్ నిర్మాణం పూర్తి అయితే.. ఐటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారికి భారీ ఉపశమనం కలగనుంది. ఈ ప్రాంతాల్లో ఆఫీసులు ఉన్నవారికి.. మెట్రో అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.


ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట కారిడార్


ఇక మరో కారిడార్‌లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు మెట్రో విస్తరణ చేయనున్నారు. 7.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ మార్గంలో 6 మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి. ఈ మార్గం పూర్తి అయితే పాతబస్తీలో ఉన్న ప్రాంతాలకు కూడా మెరుగైన మెట్రో కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది.


మియాపూర్-పటాన్‌చెరు కారిడార్


వీటితోపాటు.. మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు మరో కారిడార్‌ను విస్తరించనున్నారు. 13.4 కిలోమీటర్ల మేర ఉండే ఈ కారిడార్‌లో 10 మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. ముంబై హైవేపై ఇప్పటికే ఉన్న నాగోల్-మియాపూర్ రెడ్ లైన్ మార్గాన్ని మరింత దూరం విస్తరించనున్నారు.


ఎల్‌బీ నగర్-హయత్‌నగర్ కారిడార్


ఎల్‌బీ నగర్ నుంచి హయత్‌నగర్ వరకు రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా మరో కారిడార్ అందుబాటులోకి రానున్నాయి. 7.1 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ కారిడార్‌లో 6 స్టేషన్లను నిర్మించనున్నారు. మియాపూర్-ఎల్బీ నగర్‌ రెడ్ లైన్ మార్గాన్ని మరింత విస్తరించి.. విజయవాడ హైవేపై ఈ ఎల్బీనగర్-హయత్‌నగర్ కారిడార్ ఏర్పాటు కానుంది. ఈ 5 కారిడార్లలో మెట్రో అందుబాటులోకి వస్తే.. రోడ్లపై వాహనాల రద్దీ భారీగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మెట్రో రెండో దశ ప్రాజెక్టు పూర్తయి.. హైదరాబాద్ శివార్ల వరకు కూడా కనెక్టివిటీ జరిగితే.. ఆయా ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి ఉద్యోగులకు భారీగా ప్రయోజనం కలగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa