ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైడ్రా ప్ర‌జావాణికి 72 ఫిర్యాదులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 10:43 AM

 కాల‌నీల్లోని పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు కేటాయించిన స్థ‌లాల‌ను కాపాడాల్సిన కాల‌నీ సంక్షేమ సంఘాల ప్ర‌తినిధులు.. వారే క‌బ్జాల‌కు తెదీస్తున్నారు. అసోసియేష‌న్ ప్ర‌తినిధులుగా చెలామ‌ణి అవుతూ పార్కు స్థ‌లం కొంత‌.. ప్ర‌జావ‌స‌రాల‌కుఉద్దేశించిన స్థ‌లాలు గుట్టు చ‌ప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. పార్కులు, ర‌హ‌దారులు, పాఠ‌శాలల క్రీడాస్థ‌లాలు, కుల సంఘాలకు ఇచ్చిన స్థ‌లాలు ఇలా క‌బ్జాల‌కు ఏదీ అన‌ర్హం కాదు అనేట్టు మాయం చేస్తున్నారు. ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తేవారిమీద దాడులు, లేదంటే కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నార‌ని సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణిలో ప‌లువురు ఫిర్యాదు చేశారు. స్థానిక అధికారుల‌కు తెలిసినా ప‌ట్టించుకోవ‌డంలేద‌ని.. ఫిర్యాదు చేసినా ఎలాంటి చ‌ర్య‌లుండ‌డంలేద‌ని ప‌లువురు పేర్కొన్నారు. ఇలా హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 72 ఫిర్యాదులు రాగా.. వాటిని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్‌గారు ప‌రిశీలించి.. ప‌రిష్కారానికి సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు. 


-ఫిర్యాదులు ఇలా... మేడ్చ‌ల్ - మ‌ల్కాజ‌గిరి జిల్లా మల్కాజిగిరి మండ‌లం రాథాకృష్ణ హౌసింగ్ కాల‌నీ పేరిట దాదాపు 28 ఎక‌రాల్లో 355 ప్లాట్ల‌తో లే ఔట్ వేశారు. ఇందులో 600ల గ‌జాలను పార్కుకోసం కేటాయించారు. ఆ పార్కులో 136 గ‌జాల స్థ‌లాన్ని క‌బ్జా చేశారు. దీనిని అడ్డుకోకోపోతే మిగ‌తా స్థ‌లం కూడా + క‌బ్జాకు గురి అవుతుంద‌ని.. వెంట‌నే హ‌ద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ వేయాల‌ని హైడ్రా ప్ర‌జావాణిలో ఆ కాల‌నీ నివాసితులు ఫిర్యాదు చేశారు. 


 గ‌చ్చిబౌలి టీఎన్‌జీవో కాల‌నీ లే ఔట్ వేసిన‌ప్పుడు సెప్టిక్ ట్యాంకుతో పాటు వాట‌ర్‌ట్యాంక‌ర్‌కు స్థ‌లాన్ని కేటాయించారు. అక్క‌డ కొంత‌మందికి ప్లాట్లు రాగా.. వేరే చోట‌కు త‌ర‌లించారు. ఇప్ప‌డు ఆ వాట‌ర్ ట్యాంక‌ర్‌, సెప్టిక్ ట్యాంక‌ర్ ప్రాంతంలో ప్లాట్లు వేసి విక్ర‌యించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నార‌ని.. ఆ స్థ‌లాన్ని ప్ర‌జావ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా కాపాడాల‌ని హైడ్రాను అక్క‌డి నివాసితులు కోరారు. 


 మ‌ణికొండ ల్యాంకోహిల్స్‌కు చేరువలో ఉన్న ఎల్ల‌మ్మ చెరువును న‌లువైపులా క‌బ్జాలు చేశార‌ని.. అక్క‌డ రేసు కోర్సు, క్రికెట్ క్రీడాస్థ‌లం, ప‌క్క‌నే పార్కింగ్‌తో పాటు.. రియ‌ల్ట‌ర్లు కూడా క‌బ్జాలు చేస్తున్నార‌ని.. ఇటీవ‌ల 3 నెల‌ల్లో అక్క‌డ ఒక భ‌వ‌నం నిర్మాణం జ‌రిగింద‌ని.. వెంట‌నే చెరువు హ‌ద్దుల‌ను నిర్ధారించి ఆక్ర‌మ‌ణ‌ల‌ను నియంత్రించాల‌ని హైడ్రా ప్ర‌జావాణిలో స్థానికులు ఫిర్యాదు చేశారు. చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి కాకుండా చూడాల‌ని కోరారు. 


 హైటెక్స్ ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌కు సమీపంలోని ఖానామెట్‌లో ఆల్ ఇండియా వెల‌మ సంఘానికి 5ఎక‌రాలు ప్ర‌భుత్వం కేటాయించింది. ఈ స్థ‌లం చుట్టూ ప్రీకాస్ట్ వాల్‌తో ప్ర‌హ‌రీ నిర్మిస్తుండ‌గానే.. కుల సంఘాల‌కు స్థ‌లాలు కేటాయించ‌డంపై కొంత‌మంది కోర్టుకెక్క‌డంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఇదే అద‌నుగా ఆ స్థ‌లాన్ని వెనుక వైపు నుంచి అక్క‌డ ఉన్న స్థానికులు మ‌ట్టిపోస్తూ క‌బ్జాచేస్తున్నార‌ని.. అదేమ‌ని అడిగితే వాచ్‌మ్యాన్‌పై దాడి చేస్తున్నార‌ని ఆ సంఘం ప్ర‌తినిధులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. కోర్టు తీర్పును బ‌ట్టి నిర్ణ‌యం ఉంటుంది.. ఈ లోగా అక్క‌డి స్థ‌లం క‌బ్జాకు గురి కాకుండా చూడాల‌ని హైడ్రాను కోరారు. 


 వ‌న‌స్థ‌లిపురం క్రిస్టియ‌న్ కాల‌నీలో ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాన్ని స్థానికంగా ఉన్న వారు క‌బ్జాచేశారు.  నాగార్జున సాగ‌ర్ ప్ర‌ధాన దారికి ఆనుకున్న ఉన్న మా కాల‌నీలో 2017లో ఆక్ర‌మించుకుని షెడ్డు వేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. మున్సిపాలిటీ అధికారులు తొల‌గించినా.. మ‌ళ్లీ క‌బ్జా ప్ర‌యత్నాలు ఆగ‌లేద‌ని.. మొత్తం 300ల గ‌జాల‌కు పైగా ఉన్న స్థ‌లాన్ని కాపాడి కాల‌నీ ప్ర‌జ‌లు వినియోగించుకునేలా చూడాల‌నిహైడ్రా ప్ర‌జావాణిలో అక్క‌డి నివాసితులు ఫిర్యాదు చేశారు. 


 కాప్రా మండ‌లం, కాప్రా స‌ర్కిల్ ప‌రిధి స‌ర్వే నంబ‌రు 215లోని ప్ర‌భుత్వ భూమిలో లే ఔట్ వేసి ప్లాట్లు విక్ర‌యించ‌డం, ఇళ్ల నిర్మాణం జ‌ర‌గ‌డం జ‌రిగింది. ఇది ప్ర‌భుత్వ స్థ‌ల‌మ‌ని కోర్టు నిర్ధారించ‌డం.. అక్క‌డ బోర్డులు ఏర్పాటుచేయ‌డం జ‌రిగింది. అయితే ఆ లే ఔట్ వేసిన వ్య‌క్తి 5 వేల గ‌జాల మేర చిన్న గ‌దులతో పాటు.. స‌ర్వే నంబ‌రు 222లో షెడ్డులు, ఫంక్ష‌న్ హాల్ నిర్మించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ నిర్మాణాల‌ను ఆప‌డంతో పాటు.. ప్ర‌భుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాల‌ని అక్క‌డి నివాసితులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. 


 మేడ్చ‌ల్‌- మ‌ల్కాజిగిరి జిల్లా కూక‌ట్‌ప‌ల్లి విలేజ్ ఆర్‌పీ కాల‌నీ, వెంక‌టేశ్వ‌రా న‌గ‌ర్లోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల గ్రౌండ్‌ను వాహేద్‌తో పాటు.. ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆక్ర‌మించుకున్నారు. పాఠ‌శాల క్రీడామైదానం లేక విద్యార్థ‌లు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ విష‌యాన్ని ఎమ్మార్వో, ఆర్‌డీవో, జీహెచ్ ఎంసీ, జ‌గ‌ద్గిరిగుట్ట పోలీసుల‌కు, జిల్లా డీఈవో తోపాటు క‌లెక్ట‌ర్‌కు లిఖిత‌పూర్వ‌క ఫిర్యాదు చేసినా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదంటూ హైడ్రా ప్ర‌జావాణిలో అక్క‌డి నివాసితులు ఫిర్యాదు చేశారు. హైడ్రా వెంట‌నే ఈ స్థ‌లాన్ని కాపాడి పాఠ‌శాల‌కు అప్ప‌గించాల‌ని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa