ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేవంత్ రెడ్డి యోగి ఆదిత్యనాథ్ ఇద్దరిదీ ఒకటే తీరన్న అక్బరుద్దీన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 28, 2026, 07:25 AM

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరిదీ ఒకటే తీరని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ తరహాలోనే తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో మసీదులు, దర్గాలను కూల్చివేస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. పాతబస్తీలోని తలాబ్‌కట్టలో గురువారం రాత్రి జరిగిన ఒక సమావేశంలో ఆయన ప్రసంగించారు. అక్బరుద్దీన్ మాట్లాడుతూముస్లింల ప్రస్తావన వస్తే కాంగ్రెస్‌, బీజేపీలు ఒక్కటైపోతాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ యాభై వేల మత కల్లోలాల ద్వారా ముస్లింలకు నష్టం చేసింది. బాబ్రీ మస్జీద్‌ కూల్చివేతకు, టాడా చట్టంతో అమాయకులను జైలుపాలు చేయడానికి కాంగ్రెస్ కారణం కాద అని ప్రశ్నించారు. అయినా తాము క్షమించి మద్దతిస్తే, బీజేపీని భూచిగా చూపి కాంగ్రెస్ నేతలు ముస్లింల ఓట్లు దండుకుంటున్నారే తప్ప వారి అభివృద్ధికి పాటుపడటం లేదని విమర్శించారు.మోదీ, యోగి, రాహుల్‌ గాంధీ, రేవంత్‌రెడ్డి రావులందరూ ఒక్కటే. అందరూ వేషాలు మార్చి మన మధ్యకు వస్తున్నారు. వారంతా ఒక్కటై ముస్లింలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు అని అక్బరుద్దీన్ ఆరోపించారు. వేములవాడలో 800 ఏళ్ల నాటి దర్గాను కూల్చివేశారని, ఆదిలాబాద్, బాన్సువాడ వంటి ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో నష్టపోయిన ముస్లింలకు ప్రభుత్వం ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని దుయ్యబట్టారు.ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు ఇవ్వడం లేదని, ఇతర హామీలను నెరవేర్చడం లేదని విమర్శించారు. ముస్లింలు ఇప్పటికైనా మేల్కొని తమ కోసం పోరాడుతున్న మజ్లిస్‌ పార్టీకి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. తాను బతికున్నంత వరకు ప్రభుత్వాలతో రాజీలేని పోరాటం చేస్తానని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa