హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కల్తీ నెయ్యి వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మాసబ్ ట్యాంక్ పోలీసులతో కలిసి గోల్కొండ టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో భారీ కల్తీ నెయ్యి ముఠా ఆటకట్టించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 భోలానగర్‌లో ప్రైడ్ డెయిరీ పేరుతో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న కేంద్రంపై ఆకస్మిక దాడులు చేశారు. ఇందులో భారీగా కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించి.. దాన్ని మొత్తం స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యితోపాటు దాన్ని తయారు చేసేందుకు ఉపయోగించే వస్తువులు, ముడి పదార్థాలు కూడా సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కల్తీలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని తీవ్ర హెచ్చరికలు చేశారు.
ఈ క్రమంలోనే ఈ కల్తీ నెయ్యి నిందితుడు మహ్మద్ జునైద్ అని గుర్తించిన పోలీసులు, టాస్క్‌ఫోర్స్ అధికారులు.. అతడిని అరెస్ట్ చేశారు. ఆ కల్తీ నెయ్యి తయారు కేంద్రం నుంచి రూ.18.26 లక్షల విలువ గల 460 కిలోల కల్తీ నెయ్యి.. ఇతర సామగ్రిని సీజ్ చేశారు. మహ్మద్ జునైద్ కల్తీ నెయ్యి తయారు చేసి.. దాన్ని హైదరాబాద్ మహా నగరంలోని పలు హోటళ్లు, శుభకార్యాలు, ఫంక్షన్లకు అమ్ముతున్నట్లు అధికారుల దర్యాప్తులో గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మాసబ్ ట్యాంక్ పోలీసులు.. సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
నిందితుడు మహ్మద్ జునైద్ హుస్సేన్ వయసు 26 ఏళ్లు అని.. అతడి తండ్రి మహ్మద్ మౌజం హుస్సేన్ అని తెలిపారు. భోలా నగర్‌లోనే అతడు నివసిస్తూ.. ప్రైడ్ డెయిరీ పేరుతో ఈ కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో 70 కిలోల కల్తీ మిశ్రమ నెయ్యితో పాటు భారీ స్థాయిలో కల్తీకి ఉపయోగించే ముడి పదార్థాలను సీజ్ చేశారు. 2,090 కిలోల ఆవు మీగడ, 1,170 కిలోల గేదె మీగడను అధికారులు పట్టుకున్నారు.
నెయ్యిని కల్తీ చేసేందుకు ఉపయోగిస్తున్న 28 డబ్బాల రుచి గోల్డ్ డాల్డా.. ఇతర ఖాళీ డబ్బాలు, వాడేసిన ఆయిల్ ప్యాకెట్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. కల్తీ నెయ్యి తయారీకి ఉపయోగిస్తున్న 2 బాయిలర్లు, ఒక పుషింగ్ మిషన్, ఒక ప్యాకింగ్ మిషన్, రెండు వెయిట్ మిషన్లు, 4 గ్యాస్ సిలిండర్లు, నెయ్యి నిల్వ ఉంచిన సుమారు 70 రకాల చిన్న, పెద్ద బేసన్లు.. ఖాళీ డ్రమ్ములు, ప్యాకింగ్ కవర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు మహ్మద్ జునైద్ హుస్సేన్ తన ప్రైడ్ డెయిరీ యూనిట్‌లో లైసెన్స్ కలిగి ఉన్నప్పటికీ.. అక్రమ సంపాదన కోసం ఇలా కల్తీ నెయ్యి తయారు చేసి.. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నాడని పోలీసులు వెల్లడించారు. తక్కువ నాణ్యత కలిగిన పామ్ ఆయిల్, డాల్డా, ఇతర హానికరమైన పదార్థాలను ఆవు, గేదె మీగడలో కలిపి ఈ కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నాడని తెలిపారు. ఇలా తయారు చేసిన కల్తీ నెయ్యిని అసలైన నెయ్యి అంటూ.. ప్రజలను నమ్మిస్తూ.. విక్రయిస్తున్నాడని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa