మావోయిస్టు కీలక నేత గణపతి లొంగిపోవాలని, ఆయనకు ఆర్థిక, ఆరోగ్య భద్రత కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మావోయిస్టులపై అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస్తామని తెలిపారు. లొంగిపోయిన వారికి ఆర్థిక, ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.లొంగిపోయిన మావోయిస్టులు లేవనెత్తే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలతో మావోయిస్టులు లొంగిపోవడం చరిత్రలో ఇదే మొదటిసారి అని గుర్తు చేశారు. వారు తమకు వైద్య సాయం కావాలని కోరారని, అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వారికి మంచి ఆర్థిక సాయం అందించే ప్రయత్నం చేస్తామని అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు భూమి ఇచ్చే విషయం ఇప్పుడే ఏమీ చెప్పలేనని వెల్లడించారు.అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. గణపతి లొంగిపోతే ఆయన ఆరోగ్యానికి, ఆర్థిక భద్రతకు హామీ ఇస్తామని స్పష్టం చేశారు. మావోయిస్టుల లొంగుబాటు కోసం అధికారులు చాలా కృషి చేశారని ప్రశంసించారు. శాంతియుత చర్చల ద్వారానే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలుగుతామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.లొంగిపోయిన మావోయిస్టులు తమకు ఆసక్తి ఉంటే రాజకీయాల్లోకి రావొచ్చని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహేశ్ కుమార్ గౌడ్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఇతర రాజకీయ పార్టీలలో చేరాలనుకున్నా అభ్యంతరం లేదని అన్నారు. సొంత గ్రామాల్లో ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజాస్వామ్య మార్గంలో ప్రజా సమస్యలను చర్చిద్దామని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa