కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్భయ నిధి కింద దేశంలోని పలు ప్రాంతాలను ఎంపిక చేస్తోంది. ఇందులో భాగంగానే బాలికలు, మహిళల కోసం సమ్మిళిత నగరాల కార్యక్రమాన్ని (ఇన్‌క్లూజివ్ సిటీస్ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్షియేటివ్) చేపట్టింది. ఇక ఈ నిర్భయ నిధి కింద తెలంగాణలోని ములుగు జిల్లాను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని ఢిల్లీలో కలిసి ధన్యవాదాలు చెప్పారు.
ఈ నిర్భయ నిధి పథకం ద్వారా మహిళలు, బాలికలకు వసతులు, సౌకర్యాలు కల్పించనున్నారు. గౌరవం, భద్రత, రవాణాను మెరుగు పరిచేందుకు జెండర్ రెస్పాన్సివ్ మౌలిక సదుపాయాలు.. మరింత మెరుగైన నిఘా వ్యవస్థలు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్‌లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ నిర్భయ నిధి ప్రాజెక్టును ములుగులో విజయవంతంగా అమలు చేసేందుకు అవసరమైన డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారు చేసేందుకు.. జిల్లా యంత్రాంగంతో కలిసి.. తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని కేంద్రమంత్రికి మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారత, భద్రతకు సంబంధించి చూపిస్తున్న చొరవను అభినందిస్తూనే.. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణ, పట్టణాల్లో మహిళల భద్రత, రక్షణను మరింత పటిష్ఠం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క తేల్చి చెప్పారు.
ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సీతక్క కీలక విన్నపం చేశారు. కేంద్ర అమలు చేస్తున్న పాలనా (Palna Scheme-మిషన్ శక్తి) పథకం కింద పనిచేసే క్రెచ్ వర్కర్లు, హెల్పర్లకు ఇచ్చే గౌరవ వేతనాలను పెంచాలని కోరారు. ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం క్రెచ్ వర్కర్లకు నెలకు రూ.5,500.. హెల్పర్లకు రూ. 3 వేలు మాత్రమే వేతనంగా ఇస్తున్నారని తెలిపిన మంత్రి సీతక్క.. వారు చేసే పనికి, నిర్వర్తిస్తున్న బాధ్యతకు.. ఈ మొత్తం ఏ రకంగానూ సరిపోదని కేంద్రమంత్రికి వివరించారు.
దాదాపు 25 మంది పిల్లల సంరక్షణను ఒక క్రెచ్‌లో చూడాలంటే ఎంతో బాధ్యత, ఓపికతో కూడిన పని అని.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వారి వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని మంత్రి సీతక్క తెలిపారు. అంత తక్కువ వేతనాలు ఇవ్వడం వల్ల నిపుణులైన సిబ్బందిని తీసుకోవడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. దీని ప్రభావం సంరక్షణపై పడుతుందని పేర్కొన్నారు. పనిచేసే తల్లులకు అండగా నిలిచే ఈ పాలనా పథకం సక్సెస్ కావాలంటే.. సిబ్బంది వేతనాలను పెంచాలని విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa