ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్తీ బాటలో పాల్గొన్న జలమండలి ఎండీ అశోక్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2026, 09:11 PM

హైదరాబాద్ నగరంలో అడుగంటున్న భూగర్భ జలాలను పెంచేందుకు నగరంలో ఇప్పటికే నిర్మించిన ఇంకుడు గుంతలను పునరుద్ధరణ చేసుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అన్నారు.జలమండలి నిర్వహిస్తున్న 'జల మండలి.. బస్తీబాట' కార్యక్రమం భాగంగా బాగ్ లింగంపల్లి వార్డు, ముషీరాబాద్ సర్కిల్ డివిజన్ 17 పరిధిలోని పద్మ కాలనీ ప్రాంతంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు..ఉదయం నీటి సరఫరా సమయంలో పలు నివాసాలలో నీటి సరఫరా వాకబు చేసిన ఎండీ నీటి నాణ్యత, సమయం పాలన తదితర వివరాలను స్థానికులను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే.. ప్రాంతంలో పలు నివాసాల్లో నీటి వృధాను గుర్తించిన ఎండీ.. విలువైన తాగునీటిని తాగునీటికి కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగిస్తే జరినామాలు విధించడంతోపాటు అవసరమైతే కనెక్షన్లు కూడా తొలగిస్తారని అన్నారు.ఈ పర్యటనలో సందర్భంగా తాగునీటిని వృథా చేస్తున్న వినియోగదారులను గుర్తించి, ఎండీ ఆదేశాల మేరకు వారికి అధికారులు జరిమానాలు విధించడంతో పాటు, అవసరమైన చోట నీటి కనెక్షన్ కూడా తొలగించారు.


 


అదేవిధంగా బాగ్‌లింగంపల్లి వార్డు పరిధిలోని ఆదిత్య అపార్ట్‌మెంట్‌లో వర్షపు నీటి సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను పునరుద్ధరించే పనులలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. జలమండలి అధికారులు ప్రజలకు తాగునీటిని వృథా చేయకుండా బాధ్యతగా వినియోగించాలని, నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ నగరానికి గోదావరి, కృష్ణ నదుల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో మంచినీటిని సేకరించి, శుద్ధి చేసి నగరవాసులకు జలమండలి సరఫరా చేస్తోందన్నారు. ఇందుకోసం జలమండలి ఎన్నో వ్యయప్రయాసలు పడుతోందన్నారు. అయితే, కొంతమంది మాత్రం అవగాహనారాహిత్యంతో నీటిని వృథా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నీటి ఇబ్బందులు వస్తాయనే అవగాహన కూడా చాలామందిలో లేదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు నీటిని సంరక్షించుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. అమూల్యమైన నీటిని గృహావసరాలకు వినియోగించుకున్న తర్వాత ఉన్న సాంకేతికతతో శుద్ధి చేసి, ఆ నీటినే నిర్మాణ, గార్డెనింగ్ వంటి ఇతర అవసరాలకు కూడా ఉపయోగించడానికి ప్రయత్నించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జలమండలి సిజిఎం ప్రభు, జిఎం శ్రీధర్ రెడ్డి డిజిఎం ఇతర అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa