టెలికం, బ్రాడ్ బ్యాండ్ సేవల్లో జియో దూసుకుపోతోంది. టెలికంలోకి చివరిగా ఎంట్రీ ఇచ్చి, పరిశ్రమలో నంబర్ 1 స్థానానికి చేరుకున్న జియో దేశవ్యాప్తంగా 5జీ సేవలను వాయు వేగంతో విస్తరిస్తోంది. ఈ ఏడాది దీపావళి నాటికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ 5జీ సేవలను అందిస్తామని సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించడం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ సంస్థ త్వరలోనే (కొన్ని నెలల్లో) జియో ఎయిర్ ఫైబర్ అనే ఉత్పత్తిని విడుదల చేయనుంది.
ఇది ఇంట్లో ఉంటే చాలు. ఎలాంటి అంతరాయాల్లేని వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ సేవలను పొందొచ్చు. ఇది ఫిక్స్ డ్ లైన్ (వైర్ల ద్వారా) ద్వారా ఇంటర్నెట్ సేవలను ఆఫర్ చేస్తున్న ఎయిర్ టెల్, యాక్ట్, బీఎస్ఎన్ఎల్ కు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు. జియో ఎయిర్ ఫైబర్ కు ఎలాంటి వైర్లూ అవసరం లేదు. చూడ్డానికి చిన్నపాటి ఎయిర్ ప్యూరిఫయర్ గా కనిపించే జియో ఎయిర్ ఫైబర్ 5జీ హాట్ స్పాట్ గా పనిచేస్తుంది. ప్రస్తుతం పోర్టబుల్ రూటర్ల సాయంతో వైర్ లెస్ బ్రాడ్ బ్యాండ్ సేవలను పొందుతున్నాం. వీటితో పోలిస్తే జియో ఎయిర్ ఫైబర్ ద్వారా నెట్ వర్క్ సామర్థ్యం మరింత బలంగా ఉంటుందని అంచనా.
నిజానికి 2022 అక్టోబర్ లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలోనే జియో ఎయిర్ ఫైబర్ ను ఆవిష్కరించింది. కానీ, అప్పటికి 5జీ సేవలు ఇంకా ఆరంభం కావాల్సి ఉంది. ఆ తర్వాత క్రమంగా దీని తయారీపై సంస్థ దృష్టి పెట్టింది. రూటర్లను సెటప్ చేసేందుకు టెక్నీషియన్ల అవసరం జియో ఎయిర్ ఫైబర్ తో తప్పనుంది. ఎయిర్ ఫైబర్ ద్వారా 1.5 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ ను ఇస్తానని జియో చెబుతోంది. విడుదల అయితే కానీ మరిన్ని వివరాలు తెలియవు.