ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) పురుషుల ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీలో భారత్-ఎ జట్టు సందడి చేస్తోంది. వరుస విజయాలతో సెమీస్‌కు దూసుకెళ్లింది. నేపాల్‌తో సోమవారం జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో భారత్-ఎ సత్తా చాటింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించి 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో వరుసగా రెండు వన్డేల్లో విజయం సాధించిన యంగ్ ఇండియా.. గ్రూప్ లో మరో మ్యాచ్ మిగిలుండగానే సెమీస్ కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. స్పిన్నర్ నిశాంత్ సింధు (4/14), పేసర్లు రాజ్యవర్ధన్ హంగర్గేకర్ (3/25), హర్షిత్ రాణా (2/16) అసాధారణ ప్రదర్శనతో నేపాల్ పతనాన్ని శాసించారు.
ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన భారత్-ఎ చెలరేగిపోయింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అభిషేక్ శర్మ (69 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 87), సాయి సుదర్శన్ (52 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్ తో 58 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు. ఈ ఓపెనింగ్ జోడీ 19 ఓవర్లలో తొలి వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టు విజయాన్ని ఖాయం చేసింది. అభిషేక్ ఔట్ కాగా.. ధ్రువ్ జురెల్ (12 బంతుల్లో 21 నాటౌట్, 2 సిక్సర్లు) వేగంగా ఆడి పని పూర్తి చేశాడు.