కాళ్లు, అరికాళ్లు, చేతులు, వేళ్లు తరచుగా తిమ్మిరి పడుతుండడాన్ని మీరు గమనించారా? దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన పనేం లేదు. మీరు చాలా సేపు ఒకే భంగిమలో కూర్చోవడం, నిల్చోవడం చేస్తుంటే మీ కాళ్లు, అరికాళ్లు లేదా తొడల ప్రాంతంలో తిమ్మిరి పట్టినట్టు అనిపిస్తుంటుంది. కొద్దిసేపు మీరు అటూఇటూ తిరగగానే ఆ సమస్య తగ్గుతుంది. ఒకవేళ మీరు ఒకే భంగిమలో కూర్చోకపోయినప్పటికీ ఇలాంటి సమస్య ఎదురవుతున్నప్పుడు కారణాలు కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గంటకు పైగా తిమ్మిరి అలాగే కొనసాగినా కూడా వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అందుకు గల కారణాలను నిర్ధారించుకుని వైద్యులు తగిన చికిత్స అందిస్తారు.
కాళ్లు, పాదాల తిమ్మిరికి ఉపశమనం ఇలా..
1. కారణాలు గమనించండి
కాళ్లు, పాదాలు తిమ్మిరి పడుతున్నప్పుడు అందుకు గల కారణాలను మీరు గమనించి మీ భంగిమ తీరు మార్చుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. సాధారణంగా మనం కంప్యూటర్, ల్యాప్ టాప్ దగ్గర కూర్చుకుని పనిచేస్తున్నప్పుడు ఒక కాలుపై ఇంకో కాలు వేసుకుని కూర్చుంటాం. అలాగే పనిచేస్తూ పోతాం. ఇలాంటి సందర్భాల్లో కాళ్లలో, అరికాళ్లలో తిమ్మిరి రావొచ్చు. ఇలాంటి భంగిమలను నివారించడమే కాకుండా తరచుగా లేచి అటూఇటూ తిరగడం వల్ల కాళ్లలో రక్తప్రసరణ సరిగ్గా ఉంటుంది. లేదా మీకు వెన్నుముక ప్రాంతంలో దెబ్బతగిలి ఉన్నా కాళ్లల్లో తిమ్మిరి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఆర్థోపెడిక్ వైద్యులు, లేదా న్యూరో ఫిజిషియన్లను సంప్రదించాల్సి ఉంటుంది.
2. మర్థన చేస్తూ ఉండండి
మీ కాళ్లు, అరికాళ్లలో రక్త ప్రసరణ పెంచేందుకు తరచుగా తిమ్మిరి పడుతున్న ప్రాంతంలో మర్థన(మసాజ్) చేస్తూ ఉండాలి. అయితే మరీ ఎక్కువ ఒత్తిడితో మసాజ్ చేయొద్దు. తిమ్మిరి ఉన్నప్పుడు అలా గట్టిగా మసాజ్ చేస్తుంటే స్పర్శ తెలియక మీరు ఎక్కువ ప్రెజర్ పెట్టే అవకాశం ఉంటుంది.
3. బిగుతు దుస్తులకు స్వస్తి పలకండి
ఫ్యాషన్ పేరుతో కొందరు బిగుతు దుస్తులు వేసుకుంటారు. కానీ మీ శరీరానికి సౌకర్యం కూడా చాలా ముఖ్యం. రక్తప్రసరణ స్తంభించిపోయేలా బిగుతైన దుస్తులు ధరిస్తే దీర్ఘకాలంలో కూడా ప్రమాదమే. అలాగే మీ అరికాళ్లు తిమ్మిరి పడుతుంటే మీ షూస్ ఏమైనా బిగుతుగా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఇక మీరు సాక్స్, స్టాకింగ్స్ గానీ ధరిస్తే వాటి పైభాగంలో టైట్‌గా ఉందేమో చూసుకోండి. లేదంటే రక్త ప్రసరణ అక్కడికే నిలిచిపోయి కింది ప్రాంతంలోకి రాకుండా పోతుంది. దీంతో తిమ్మిరి వచ్చే ప్రమాదం ఉంటుంది.
4. శరీర భంగిమ తరచూ మార్చండి..
కూర్చున్నప్పుడు, నిలుచున్నప్పుడు, పడుకున్నప్పుడు తరచుగా మీ శరీర భంగిమ మార్చడం మంచిది. ముఖ్యంగా మీరు పూజలో, వేడుకల్లో కింద కూర్చున్నప్పుడు ఒక కాలిపై ఇంకో కాలి భారం పడుతున్నప్పుడు తిమ్మిరి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటూఇటూ నడవడం, భంగిమ మార్చుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగయ్యే అవకాశం ఉంటుంది.
5. విటమిన్ లోపాలను గుర్తించండి
శరీరంలో ఎక్కడో ఒక చోట బాధపడుతోందంటే విటమిన్ల లోపం ఎదుర్కుంటున్నట్టు గుర్తించండి. మీ చేతులు, కాళ్లు, అరికాళ్లలో తిమ్మిర్లు వస్తున్నాయంటే మీరు కచ్చితంగా బీ -కాంప్లెక్స్ విటమిన్ లోపాలతో బాధపడుతున్నట్టు లెక్క. అలాగే పొటిషియం, కాల్షియం, సోడియం వంటి ఖనిజ లవణాల లోపం కారణంగా కూడా తిమ్మిరి వస్తుంది. ముందుగా మీరు బీ-12 విటమిన్ పరీక్ష చేయించుకోండి. లోపం కనిపిస్తే తప్పనిసరిగా వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్లు వాడండి. ఒకవేళ మీరు మాంసాహారులైతే మాంసం తినండి.
6. ఈ వ్యాధులు ఉన్నాయోమో గమనించండి
డయాబెటిస్ ఉన్న వారు, అధిక చెడు కొలెస్ట్రాల్ ఉన్న వారు, నరాల బలహీనత ఉన్న వారిలో కూడా తిమ్మిర్లు రావొచ్చు. వైద్యుడి సలహా మేరకు సంబంధిత పరీక్షలు చేయించుకుని మందులు వాడాలి. ఒకవేళ మీ శరీరంలో మలినాలు ఎక్కువైనప్పుడు కూడా రక్త ప్రసరణ సమస్యలు ఏర్పడుతాయి. అంటే మద్యపానం, దూమపానం వంటి వాటికి స్వస్తి పలకాలి.
7. వ్యాయామం తప్పనిసిరి
శరీరం తిమ్మిర్ల బారిన పడుతుంటే మీలో శారీరక చురుకుదనం తగ్గుతోందని కూడా గమనించాలి. అధిక బరువు ఉన్న వారు, డయాబెటస్ ఉన్న వారు తరచుగా తిమ్మిర్ల బారిన పడుతుంటారు. అందువల్ల వారు శారీరక శ్రమ పెంచాలి. ఒకవేళ వారికి కదలిక లేని జీవన శైలి అయితే తక్షణం 30 నుంచి 40 నిమిషాల పాటు నడక, తేలికపాటి వ్యాయామాలు ప్రారంభించాలి.
8. ఈ లక్షణాలు ఉంటే ఆసుపత్రికి వెళ్లండి
కాళ్లు, అరికాళ్లలో తిమ్మిర్లు రావడం చాలా సాధారణం. ఒక్కోసారి స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా ఇలా జరగొచ్చు. అసలు మీరు కదలడానికి కూడా వీల్లేనంత నీరసం, అకస్మాత్తుగా తలనొప్పి రావడం, మీ మూత్రవిసర్జన, మల విసర్జనపై మీకు నియంత్రణ లేకపోవడం, గందరగోళంలో పడడం, స్పృహ కోల్పోతున్నట్టు అనిపించడం, మాట తడబడడం, మాట్లాడలేకపోవడం, కళ్లు మసక బారడం వంటి లక్షణాలు గమనిస్తే మాత్రం ఆసుపత్రికి వెళ్లడం అత్యవసరంగా గమనించాలి.