దేశీయంగా సేవలందిస్తున్న ప్రభుత్వం రంగ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అదరగొట్టింది. చాలా బ్యాంకులు డిపాజిట్ల సేకరణలో డబులు డిజిట్ వృద్ధి సాధించేందుకు ఇబ్బందులు పడుతున్న తరుణంలో అత్యధిక వృద్ధి నమోదు చేసిన బ్యాంకుగా నిలిచి రికార్డ్ కొట్టింది. 2023, డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కేవలం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు మాత్రమే రెండంకెల వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. అందులో బీఓఎం ఎస్‌బీఐని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. క్యూ3లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలోనే ప్రజలు ఎక్కువగా డబ్బులు దాచుకున్నట్లు దీని ద్వారా స్పష్టమవుతోంది.
పుణె కేంద్రంగా సేవందిస్తున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డిపాజిట్ల సేకరణలో డిసెంబర్ త్రైమాసికంలో 17.89 శాతం వృద్ధి నమోదు చేసింది. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 12.84 శాతం వృద్ధి నమోదు చేసింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల్లో ఈ గణాంకాలు వెల్లడించాయి. అయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం డిపాజిట్లు రూ.45,67,927 కోట్లుగా ఉన్నాయి. ఇవి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మొత్తం డిపాజిట్లు రూ.2,45,734 కోట్లతో పోలిస్తే 18.5 రెట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం.
పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండి
మరోవైపు.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యూ3లో డిపాజిట్ల సేకరణ వృద్ధి 9.53 శాతంగా ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో డిపాజిట్ల సమీకరణ వృద్ధి డిసెంబర్ త్రైమాసికంలో 9.10 శాతంగా ఉంది. అలాగే లో కాస్ట్ కాసా డిపాజిట్ల విషయానికి వస్తే మళ్లీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రనే 50.19 శాతం వృద్ధితో అగ్రస్థానంలో ఉండగా.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 48.98 శాతంతో రెండో స్థానంలో ఉంది. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ గరిష్ఠ స్థాయిలో ఉంటే బ్యాంకుల కాస్ట్ ఆఫ్ ఫండ్స్ తక్కువగా ఉంటుంది.
ఆస్తుల నాణ్యత విషయానికి వస్తే డిసెంబర్ 31, 2023 నాటికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఎస్‌బీఐ అత్యల్ప స్థూల నిరర్థక ఆస్తులను కలిగి ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2.04 శాతం, ఎస్‌బీఐ 2.42 శాతంగా ఉన్నాయి. నికర ఎన్‌పీఏల పరంగా బీఓఎం, ఇండియన్ బ్యాంక్ అత్యల్పం నికర ఫలితాలను చూపించాయి. ఈ రెండు బ్యాంకుల్లో నికర ఎన్‌పీఏలు వరుసగా 0.22 శాతం, 0.53 శాతంగా ఉన్నాయి. అయితే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ త్రైమాసిక నెట్ ప్రాఫిట్ గ్రోత్ ఎక్కువగా ఉంది. 253 శాతం వృద్ధి నమోదు చేసింది. రూ.2,223 కోట్లు లాభాలు అందుకుంది.