ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఓటీపీ వెరిఫికేషన్‌కు స్వస్తి.. ఇక ఫోన్ అవసరం ఉండదా

business |  Suryaa Desk  | Published : Sun, Feb 11, 2024, 11:15 PM

ప్రస్తుతం మన దేశంలో డిజిటల్ పేమెంట్ల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. అంతే స్థాయిలో ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సెకండ్ ఫ్యాకర్ట్ అథెంటికేషన్ అంశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్ఎంఎస్ ఆధారిత వన్ టైమ్ పాస్‌వర్డ్స్ బదులుగా ఇతర అవకాశాలను పరిశీలించాలని బ్యాంకుల వంటి రెగ్యులేటెడ్ సంస్థలను ఆర్‌బీఐ కోరింది. అంటే మరి కొన్ని రోజుల్లోనే ఓటీపీకి స్వస్తి పలకనున్నట్లు స్పష్టమవుతోంది. ఇకపై ఓటీపీ ఆధారిత వెరిఫికేషన్ లేకుండానే పేమెంట్లు చేసేందుకు వీలు కలుగనుంది. ఈ క్రమంలో ఓటీపీ స్థానంలో ఎలాంటి కొత్త విధానం తీసుకొస్తారు? దానికి మొబైల్ అవసరం ఉండదా? అనే ప్రశ్నలు తెలత్తడం సహజం. వాటి గురించి తెలుసుకుందాం.


డిజిటల్ చెల్లింపుల ధ్రువీకరణ కోసం ఓటీపీ అథెంటికేషన్ బదులుగా కొత్త మెకానిజం అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవలే ప్రకటించారు. ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై వెల్లడించారు. డిజిటల్ పేమెంట్స్ విధానంలో మార్పులకు అనుగుణంగా.. చెల్లింపులకు మరింత భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ విధానం తీసుకువస్తున్నట్లు తెలిపారు. అయితే, ఓటీపీకి స్వస్తి పలికినప్పటికీ కొత్త మెకానిజంలోనూ అథెంటికేషన్ చేసేందుకు మొబైల్ అవసరం కానుంది. అథెంటికేషన్ కోసం తప్పనిసరిగా మొబైల్ ఉండాల్సిందే.


బ్యాంకుల ప్రకారం.. సైబర్ నేరగాళ్లు తెలివిగా వ్యవహరిస్తూ కస్టమర్ల వివరాలు, పాస్‌వర్డ్స్ తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత ఓటీపీ కోసం సిమ్ కార్డు స్వాపింగ్ చేసి ఖాతాల్లోని డబ్బులు కాజేస్తున్నారు. అలాగే ఓటీపీకి బదులుగా మరో ఫోన్ యాప్ నుంచి పాస్ వర్డ్ అడిగే అథెంటికేటర్ యాప్ అనేది కీలకంగా మారుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు. దీనికి అదనంగా సర్వీస్ ప్రొవైడర్లు ప్రత్యామ్నాయాలను సృష్టించుకోవచ్చు. అందులో మొబైల్ అప్లికేషన్స్ లో టోకెన్ల వంటివి జనరేట్ చేయడం ఉండొచ్చని తెలిపారు. అయితే, వీటన్నింటికీ మొబైల్ ఫోన్ అవసరమవుతుందని స్పష్టం చేస్తున్నారు.


కమ్యూనికేషన్ ప్లాట్ ఫారమ్ రూట్ మొబైల్ ఇప్పటి వరకు వివిధ సర్వీస్ ప్రొవైడర్ల తరపున ప్రతి నెలా దాదాపు నాలుగు బిలియన్ల ఓటీపీలను పంపుతుందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. డిజిటల్ విధానం పెరుగుతున్న క్రమంలో అదే స్థాయిలో డిజిటల్ మోసాలు సైతం పెరుగుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం పెరుగుతున్న మోసాలపై ఎలాంటి చర్చలు లేకుండా అధిక వృద్ధిని కనబరుస్తున్న ఎమర్జింగ్ మార్కెట్ల మధ్య అంతరాన్ని చూస్తున్నామని రూట్ మొబైల్ ఎండీ, సీఈఓ రాజ్ దీప్ కుమార్ గుప్తా ఇటీవల ఓ కార్యక్రమంలో అభిప్రాయం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com