సొంతంగా చిన్న వ్యాపారం పెట్టుకోవాలని భావిస్తున్న వారికి మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందిస్తోంది. వీధి వ్యాపారులకు పెట్టుబడి అందించేందుకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాలు ఇస్తోంది. లోన్ సరైన సమయానికి తిరిగి చెల్లించిన వారికి మరుసటి ఏడాది రెట్టింపు రుణం ఇస్తారు. పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి- పీఎం స్వానిధీ యోజన తీసుకొచ్చింది. దీని ద్వారా పట్టణాలు, ఇతర ప్రాంతాల్లో తోపుడు బండ్లు, రోడ్డు పక్కన చిన్న కొట్టు పెట్టుకుని వ్యాపారం నిర్వహించే వారికి ఈ రుణాలు ఇస్తుంటారు. వడ్డీలో 7 శాతం మేర రాయితీ ఇస్తోంది. అంటే 7 శాతం వడ్డీ కేంద్రమే చెల్లిస్తుంది. అలాగే డిజిటల్ పేమెంట్స్ చేసిన వారికి క్యాష్ బ్యాక్ ఆఫర్ సైతం ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్ అందిస్తోంది.
పీఎం స్వనిధి బెనిఫిట్స్..
పీఎం స్వనిధి పథకం ద్వారా లోన్ తీసుకున్న వారు నిర్ణీత సమయంలో తిరిగి చెల్లిస్తే వారికి అదనపు ప్రయోజనాలు ఉంటాయి. వడ్డీ రేటులో 7 శాతం సబ్సిడీ లభిస్తుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా పేమెంట్స్ చేస్తే ఏడాదిలో రూ.1200 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. వడ్డీ రాయితీ, క్యాష్ బ్యాక్ కలిపి ఏకంగా రూ.1600 వరకు ఆదా అవుతుంది. సకాలంలో రుణాలు తీర్చిన వారికి మరుసటి విడతలో రెట్టింపు లోన్ పొందవచ్చు. మొదటి సారి రూ.10 వేలు లోన్ ఇస్తారు. ఆ తర్వాత రూ.50 వేల వరకు అందుకోవచ్చు. ఈ లోన్ కోసం ఎలాంటి స్థిర చరాస్తులు తనఖా పెట్టాల్సిన అవసరం లేదు.
అర్హులు వీరే..
వీధి వ్యాపారులు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులు అవుతారు. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, తోపుడు బండ్లపై విక్రయాలు చేసే వారు, స్ట్రీట్ ఫుండ్ సెంటర్లు నడిపేవారు, బార్బర్ షాప్ నిర్వహించే వారు ఈ కేటగిరీలోకి వస్తారు. వారికి ఎలాంటి గ్యారెంటీ లేకుండా లోన్ ఇస్తుంది.
కావాల్సిన పత్రాలు ఇవే..
పీఎం స్వనిధి ద్వారా లోన్ పొందాలనుకుంటే కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరమవుతాయి. అందులో ఆధార్ కార్డు, ఆధార్ నంబర్ తో లింక్ అయిన మొబైల్ నంబర్ ఉండాలి. వీటితో పాటు వెండింగ్ సర్టిఫికెట్ లేదా అర్బన్ లోకల్ బాడీ జారీ చేసిన గుర్తింపు కార్డు ఉండాలి. ఐడీ కార్డు లేని వారు టౌన్ వెండింగ్ కమిటీ లేదా అర్బన్ లోకల్ బాడీస్ నుంచి రకమెండేషన్ లెటర్ తీసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..
నేరుగా ఆన్‌లైన్ ద్వారా పీఎం స్వనిధి లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా కామన్ సర్వీస్ సెంటర్ కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా చేయాలనుకునే వారు https://pmsvanidhi.mohua.gov.in/ వెబ్‌సైట్ లోకి వెళ్లాలి. అక్కడ మీకు రూ.10 వేల లోన్, రూ.20 వేల లోన్, లోన్ స్టేటస్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. మొదటిసారిగా అప్లై చేసే వారు రూ.10 వేల లోన్ ఆప్షన్ ఎంచుకోవాలి. రెండోసారి అప్లై చేసే వారు రూ.20 వేల లోన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఓ కొత్త విండో ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ లో మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. ముఖ్యంగా వెండర్ ఐడీ సమర్పించాలి. అన్ని వివరాలు చెక్ చేసుకుని సబ్మిట్ చేయాలి.
వడ్డీ ఎంత? క్యాష్ బ్యాక్‌తో ఎంత లాభం?
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్సీలు వంటివి లోన్లు ఇస్తాయి. ఎల్ఓఆర్ పొందిన తర్వాత బ్యాంక్ ద్వారా లోన్ పొందవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 24 శాతం వరకు వడ్డీ ఉంది. అయితే, అందులో 7 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తోంది కేంద్రం. తొలి విడతలో ఇచ్చే రూ.10 వేలపై వడ్డీ మొత్తం రూ.1,348 అవుతుంది. రూ.10 వేలకు మొత్తం చెల్లించాల్సింది రూ.11,349 అవుతుంది. నెలకు రూ.946 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే, డిజిటల్ పేమెంట్ చేస్తే రూ.100 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. దీని ద్వారా 12 నెలలకు రూ.1200 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. క్యాష్ బ్యాక్, వడ్డీ రాయితీ రూ.402 ప్రకారం మొత్తంగా రూ.1602 ప్రయోజనం పొందవచ్చు.