క్రెడిట్ కార్డుల్ని సక్రమంగా వాడినట్లయితే క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నిర్వహణ అలవడుతుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లయితే మంచి క్రెడిట్ హిస్టరీ కూడా నిర్మించుకోవచ్చు. బిల్ పేమెంట్స్, కొనుగోళ్లకు కార్డును ఉపయోగించుకుంటూ సకాలంలో బకాయిలు చెల్లిస్తే క్రెడిట్ స్కోరు మెరుగవుతుందని చెప్పొచ్చు. ఈ ప్రయోజనాల నేపథ్యంలో వీటి వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడు క్రెడిట్ కార్డులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల పలు కొత్త రూల్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇంకా మీకు క్రెడిట్ కార్డులకు సంబంధించి ఏ సందేహానికైనా సమాధానాలు కూడా ఇచ్చింది. వీటి గురించి తెలుసుకుందాం.
>> మీ అనుమతితోనే కార్డు..
కార్డు జారీ చేసే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కచ్చితంగా ఇకపై కస్టమర్ల అనుమతితోనే క్రెడిట్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. అప్లై చేసుకోకున్నా.. కార్డు పంపితే మాత్రం దాన్ని యాక్టివేట్ చేయొద్దు. కస్టమర్ల అభ్యర్థనతో.. 7 రోజుల్లో ఏ ఛార్జీ విధించకుండా సదరు జారీ సంస్థలు ఆ క్రెడిట్ కార్డ్ అకౌంట్‌ను మూసేయాలి. ప్రాసెస్ పూర్తయ్యాక కస్టమర్లకు సమాచారం అందించాలి. తర్వాత కస్టమర్ ఆ కార్డ్ ధ్వంసం చేయాలి. అవసరమైతే ఆర్బీఐ అంబుడ్స్‌మెన్‌కు కంప్లైంట్ కూడా ఇవ్వొచ్చు.
>> ట్రాన్సాక్షన్ చేయకున్నా.. కార్డు వాడినట్లేనా?
ఆర్థిక లావాదేవీలు చేయకపోయినా.. స్టేట్‌మెంట్లు తీయడం, పిన్ మార్చడం, ట్రాన్సాక్షన్ పరిమితిని సవరించడం వంటివి ఏం చేసినా.. కార్డు వినియోగంలో ఉన్నట్లే లెక్క.
>> పాక్షిక పేమెంట్స్ చేస్తే.. బిల్లు మొత్తంపై వడ్డీ, రుసుములు వర్తిస్తాయా?
మొత్తం బిల్‌ను టైంకు కట్టకపోతే వడ్డీ రహిత గడువు బెనిఫిట్ కోల్పోతారు. పాక్షిక చెల్లింపులు చేస్తే.. మిగతా మొత్తంపై ట్రాన్సాక్షన్ జరిగిన రోజు నుంచి వడ్డీ పడుతుంది. ఇతర రుసుములు కూడా బకాయిలకే వర్తిస్తాయి. అంతేగానీ బిల్లు మొత్తానికీ వడ్డీ, ఇతర రుసుములు కట్టనక్కర్లేదు.
బిల్లింగ్ సైకిల్ తేదీ మార్చుకోవచ్చా?
మీ క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్ ప్రారంభ, ఆఖరి తేదీలు కనీసం ఒక్కసారైనా మార్చుకునేందుకు కస్టమర్లకు సంస్థలు ఆప్షన్ ఇవ్వాలి. ఇంకా ఇ-మెయిల్, హెల్ప్‌లైన్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వాటి ద్వారా బిల్లింగ్ సైకిల్ మార్పు కోసం అభ్యర్థన పెట్టుకోవచ్చు.
లిమిట్‌కు మించి వాడొచ్చా?
క్రెడిట్ కార్డుల్లో ఎంత మొత్తం వాడుకోవచ్చనే దానిపై కొంత లిమిట్ ఉంటుంది. కస్టమర్ల అనుమతితో దానికి మించి వాడుకునే ఆప్షన్ సంస్థలు ఇవ్వొచ్చు. అవసరం లేదనుకుంటే డీయాక్టివేట్ చేయొచ్చు. కస్టమర్‌కు తెలియకుండా అదనపు పరిమితిని అనుమతించడం, దానిపై ఛార్జీలు వసూలు చేయడం చేయొద్దు. ఇంకా ఓవర్ లిమిట్ ఛార్జీల్ని వేసే సమయంలో వడ్డీ, రుసుముల్ని క్రెడిట్ లిమిట్ పరిధిలోకి తీసుకోవద్దు.
ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిందేనా?
క్రెడిట్ కార్డులపై బీమా (ఇన్సూరెన్స్) కచ్చితంగా ఇవ్వాలనే నిబంధన ఏం లేదు. అయితే సంస్థలు, నెట్‌వర్క్స్ తమ కస్టమర్లకు ఇవ్వాలనుకుంటే నామినీ సహా బీమా వివరాల్ని ప్రతి స్టేట్‌మెంట్లో కచ్చితంగా తెలియజేయాలి.
>> క్రెడిట్ కార్డుల్ని బ్లాక్ లేదా డీయాక్టివేషన్ చేసినట్లయితే కేవలం దానిని వాడుకునేందుకు మాత్రమే కుదరదు. అంతేగానీ సంస్థలో ఉన్న క్రెడిట్ కార్డ్ అకౌంట్ మాత్రం కొనసాగుతుంది. మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే 7 రోజుల్లోగా సంస్థలు ఖాతా మూసేయాల్సి ఉంటుంది.
>> మీకు క్రెడిట్ కార్డులకు సంబంధించి ఫిర్యాదులేమైనా ఉంటే.. మొదటగా జారీ సంస్థలకు తెలియజేయాలి. 30 రోజుల్లో స్పందించకున్నా.. తిరస్కరించినా.. వారు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకున్నా.. సదరు కస్టమర్ ఆర్బీఐ అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించొచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ దరఖాస్తు ఫారంతో కంప్లైంట్ చేయొచ్చు.