భారత ఐటీ దిగ్గజ సంస్థలకు గడ్డుకాలం నడుస్తోంది. ఆర్థిక మందగమనం భయాలు, అనిశ్చితితో అంతా గందరగోళం నెలకొంది. ముఖ్యంగా దిగ్గజ కంపెనీల్లో కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భారత ఐటీ సంస్థలు ఇప్పుడు నాలుగో త్రైమాసికం ఫలితాల్ని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్ వరుసగా ఏప్రిల్ 12, ఏప్రిల్ 18న ఫలితాల్ని ప్రకటించాయి. రెండూ అంచనాల్ని మించే రాణించాయి. లాభం, ఆదాయం పెరిగింది. అయితే ప్రధాన సమస్యల్లా ఉద్యోగులు కంపెనీల్ని వీడుతుండటం. అదే అట్రిషన్ రేటు.. అంటే సిబ్బంది వలసలు అన్నమాట. అంటే కంపెనీల్ని వీడి ఇతర కంపెనీలకు చేరే ఉద్యోగుల శాతం.
గత కొంత కాలంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య ఎన్నడూ లేని విధంగా ప్రతి త్రైమాసికంలో తగ్గుకుంటూ వస్తోంది. మార్చి త్రైమాసికంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 1759 తగ్గగా.. ఆర్థిక సంవత్సరం మొత్తంలో కూడా ఉద్యోగుల సంఖ్య పడిపోవడం 19 ఏళ్లలో తొలిసారి. ఇక ఇన్ఫోసిస్‌లో సమీక్షా త్రైమాసికంలో 5423 మంది ఉద్యోగులు కంపెనీని వీడగా.. ఇక్కడ 23 ఏళ్లలో ఇలా ఉద్యోగులు తగ్గడం తొలిసారి కావడం గమనార్హం.
ఇక ఇప్పుడు విప్రోలో అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వరుసగా ఆరో త్రైమాసికంలో కూడా ఇక్కడ ఉద్యోగుల సంఖ్య పడిపోయింది. జనవరి నుంచి మార్చి వరకు విప్రోలో 6180 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. అట్రిషన్ రేటు తగ్గించుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్న తరుణంలోనూ ఉద్యోగుల సంఖ్య ఇంతలా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఫుల్ ఇయర్ బేసిస్‌లో చూసినట్లయితే విప్రో మొత్తం ఉద్యోగుల సంఖ్య 24,516 పడిపోయింది. మొత్తం విప్రోలో ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 2,34,054 గా ఉంది. ఇక విప్రో అట్రిషన్ రేటు 12 నెలల సమయంలో 14.2 శాతానికి పెరగడం గమనార్హం. మొత్తంగా టీసీఎస్ ఏడాది వ్యవధిలో 13,249 మంది తగ్గిపోయారు. ఇన్ఫోసిస్‌లో ఏకంగా 25,994 మంది ఉద్యోగులు తగ్గారు. విప్రో ఫలితాల సందర్భంగా ఇన్వె్స్టర్లకు మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఒక్కో షేరుపై రూ. 1 డివిడెండ్ ప్రకటించింది.
ఇక ఇతర కంపెనీలతో పోలిస్తే విప్రోను ఎన్నో సవాళ్లు పరీక్షిస్తున్నాయి. కంపెనీ సీఈఓ థియరీ డెలాపోర్టే కూడా ఇటీవల రాజీనామా చేయగా.. ఏప్రిల్ నెలలోనే శ్రీని పల్లియా ఆ బాధ్యతల్లోకి వచ్చారు. అంతకుముందు పలువురు సీనియర్ ఉద్యోగులు, ముఖ్య పదవుల్లో ఉన్న వారు కంపెనీని వీడటం గమనార్హం.