బ్యాంక్ సెలవులు: డబ్బులు డిపాజిట్ చేయాలన్నా.. నగదు విత్‌డ్రా చేసుకోవాలన్నా.. చెక్స్ డిపాజిట్ చేయడం, విత్‌డ్రా చేయడం సహా ఇంకా లోన్ తీసుకోవాలన్నా.. ప్రభుత్వ పథకాలకు సంబంధించి డబ్బుల్ని తెచ్చుకొనేందుకు అయినా.. ప్రభుత్వ పథకాల్లో చేరేందుకు ఇలా ఎన్నో పనుల కోసం బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఇప్పుడు అన్ని వర్గాల వారికి బ్యాంక్ అకౌంట్ అవసరం పడుతుంది. అందుకే నిత్యం బ్యాంకుల్లో రద్దీ ఉంటూనే ఉంటుంది. అక్కడికి వెళ్లినా మనకు వెంటనే పనులు కావు. కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులు కూడా తిరగాల్సి ఉంటుంది. ఇక బ్యాంకులు ప్రతి రోజూ పనిచేయవు. రెండో, నాలుగో శనివారం సహా ఆదివారాలు బ్యాంకులు మూసివేసి ఉంటాయి. త్వరలో ప్రతి శనివారం కూడా సెలవు ఉండనుంది. ఇంకా కొన్ని పండగల సమయాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
అందుకే బ్యాంకులకు సెలవులు ఎప్పుడు ఉన్నాయి.. ఎప్పుడు పనిచేస్తాయి వంటి విషయాలు ముందుగానే తెలుసుకోవాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంక్ పనుల్ని పూర్తి చేసుకోవచ్చు. లేకపోతే.. తీరా బ్యాంకుకు వెళ్లాక మూసివేసి ఉంటే సమయం వృథా. ఖర్చులు కూడా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జూన్ నెలకు సంబంధించి బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేస్తాయో తెలుసుకుందాం.
జూనె నెలలో మొత్తంగా 12 రోజులు బ్యాంకులు మూసివేసి ఉంటాయి. దీంట్లో రెండవ, నాల్గవ శనివారాలు సహా ఆదివారాలు ఉంటాయి. ఇక ప్రాంతాల్ని బట్టి బ్యాంకుల సెలవులు మారుతుంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సెలవుల్ని నిర్ణయిస్తుంటుంది. మొత్తంగా ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు బ్యాంక్ సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం.
జూన్ 2- ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
జూన్ 8- రెండో శనివారం సందర్భంగా బ్యాంకులకు హాలిడే ఉంది.
జూన్ 9- ఆదివారం బ్యాంకులకు సెలవు ఉంది. ఇంకా ఇదే రోజు మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్‌లో సెలవు ఉంది.
జూన్ 10- శ్రీ గురు అర్జున్ దేవ్ మార్టిర్‌డమ్ డే సందర్భంగా పంజాబ్‌లో బ్యాంకులకు సెలవు ఉంది.
జూన్ 14- పహిలి రాజా డే సందర్భంగా ఒడిశాలో బ్యాంకులకు సెలవు ఉంది.
జూన్ 15-వైఎంఏ డే నేపథ్యంలో మిజోరంలో బ్యాంకులకు సెలవు. రాజా సంక్రాంతి సందర్భంగా ఒడిశాలో ఈ రోజున బ్యాంకులు మూసివేసి ఉంటాయి.
జూన్ 16- ఆదివారం
జూన్ 17- బక్రీద్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ రోజున బ్యాంకులు మూసివేసి ఉంటాయి.
జూన్ 21- వత్ సావిత్రి వ్రత్ సందర్భంగా పలు రాష్ట్రాల్లో ఈ రోజున బ్యాంకులకు సెలవు ఉంది.
జూన్ 22- నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులు మూసివేసి ఉంటాయి.
జూన్ 23- ఆదివారం
జూన్ 30- ఆదివారం
బ్యాంకులకు ఆయా రోజుల్లో సెలవు ఉన్నప్పటికీ.. ఆ రోజున ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలు వినియోగించుకోవచ్చు. బ్యాంక్ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్స్, ఏటీఎం సేవల్ని పొందొచ్చు. బ్యాంక్ సిబ్బందిని కలిసి మీ సమస్యల పరిష్కారం కోసమైతే.. బ్యాంకులు పనిచేసే రోజుల్లోనే చూసుకోవాల్సి ఉంటుంది.