ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరికొన్ని ప్రభుత్వ బ్యాంకుల విలీనం.. ఆ రెండు బ్యాంకులే.. ఇక ప్రైవేటీకరణ లేనట్లేనా?

business |  Suryaa Desk  | Published : Sun, May 26, 2024, 10:01 PM

గత కొంత కాలంగా భారత ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకులైన సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా సహా ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకుల ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. వీటి భవిష్యత్ ప్రణాళికలపై పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రైవేటీకరణ చేసే బదులుగా.. మరికొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతోనే బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని చూస్తోంది. ఇదివరకే కొన్ని బ్యాంకుల్ని విలీనం చేసి.. పెద్ద బ్యాంకులుగా మార్చిన విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు గుర్తుచేశారు. 2021-22 సాధారణ బడ్జెట్ సమయంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రణాళికల్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించినప్పటికీ.. ఇది ఇప్పటివరకు అమలు కాలేదు. ఐడీబీఐ బ్యాంక్ నుంచి ప్రభుత్వ వాటా విక్రయించడంలో కూడా విఫలమయ్యారు.


ఇక పీఎస్ బీ లను కొనుగోలు చేసేందుకు.. ఆసక్తి తగ్గిన పెట్టుబడులు ఉన్న వారు లభించడంపైనా ధీమా లేనందునే.. ప్రైవేటీకరణ ప్రణాళికపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లే తెలుస్తోంది. ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వ వాటా విక్రయిస్తే.. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు మార్గం సుగమం అవుతుందని భావించారు. ఇంకా కొవిడ్ పరిణామాలు, పీఎస్ బీ లపై పెట్టుబడిదారుల్లో ఆసక్తి తగ్గడం కూడా ప్రతికూల ప్రభావం చూపాయి.


లాభాల పంట..


గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు మంచి లాభాల్ని నమోదు చేశాయి. ఒక సమయంలో మొండి బకాయిలతో కుదేలైన ఈ బ్యాంకులు ఇప్పుడు గణనీయంగా పుంజుకున్నాయి. 2016-17 నుంచి 2021-22 మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకులకు దాదాపుగా రూ. 3 లక్షల కోట్ల మూలధన సాయం ప్రభుత్వం అందించింది. కొన్ని త్రైమాసికాలుగా ఇవి ఆకర్షణీయ ఫలితాల్ని నమోదు చేయడం సహా ప్రభుత్వానికి కూడా డివిడెండ్ భారీగా చెల్లిస్తున్నాయి. 2023-24లో 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ. 1.4 లక్షల కోట్లుగా నమోదైంది. 2022-23లో బ్యాంకులు ఆర్జించిన రూ. 1 లక్ష కోట్లతో పోలిస్తే ఇది ఏకంగా 35 శాతం ఎక్కువ.


>> ప్రభుత్వ రంగంలోని పెద్ద బ్యాంకులతో కొన్ని చిన్న బ్యాంకుల్ని విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తే.. సెబీ ప్రజా వాటా నిబంధనల్ని అందుకునేందుకు దోహదపడనుంది. అన్ని నమోదిత సంస్థల్లో కనీసం 25 శాతం ప్రజా వాటా ఉండాలనేది సెబీ నిబంధనగా ఉంది. ప్రస్తుతం 12 పీఎస్ బీ బ్యాంకులు ఉండగా.. 5 బ్యాంకులు ఈ వాటా నిబంధనల్ని అందుకోవట్లేదు.


>> ఇక ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు నడుసున్న నేపథ్యంలో.. ప్రభుత్వ బ్యాంకుల విలీనం ఓఆర్ ప్రైవేటీకరణపై స్పందించలేమని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి చెప్పారు. ఇలాంటి అంశాలపై ఇప్పుడే మాట్లాడలేమని అన్నారు. ఇదివరకు రెండు విడతల్లో బ్యాంకుల విలీనం చేపట్టింది ప్రభుత్వం. 2019 ఏప్రిల్ 1న దేనా బ్యాంక్, విజయా బ్యాంకులు.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం అయ్యాయి. 2020 ఏప్రిల్ 1న మరో 10 ప్రభుత్వ బ్యాంకులు కలిసి .. 4 పెద్ద బ్యాంకులుగా ఏర్పడ్డాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com