ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తమ ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించినట్లు ప్రకటించింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం సవరించిన కొత్త వడ్డీ రేట్లు జూన్ 12, 2024వ తేదీ నుంచే అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం 7 రోజుల నుంచి 10 ఏళ్ల మెచ్యూరిటీ టెన్యూర్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు వడ్డీ రేటు 4.25 శాతం నుంచి 7.25 శాతంగా అందిస్తోంది. ఎంపిక చేసిన టెన్యూర్లపై సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేట్లు ఇస్తోంది. మరోవైపు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్ తీసుకొచ్చిన క్రమంలో కీలక మార్పులు చేసింది బ్యాంక్ ఆఫ్ బరోడా. రిటైల్ టర్మ్ డిపాజిట్ల నగదు విలువ రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు మార్చింది. అంటే ఇకపై రూ.3 కోట్ల వరకు రిటైల్ డిపాజిట్లుగానే పరిగణనలోకి తీసుకుంటారు. రిటైల్ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లే వర్తిస్తాయి.
బీఓబీ లేటెస్ట్ వడ్డీ రేట్లు..
7 రోజుల నుంచి 14 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 4.25 శాతం వడ్డీ ఇస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
15 రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 4.50 శాతం, సీనియర్లకు 5 శాతం వడ్డీ అందిస్తోంది.
46 రోజుల నుంచి 90 రోజుల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
91 రోజుల నుంచి 180 రోజులకు జనరల్ కస్టమర్లకు 5.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.10 శాతం వడ్డీ ఇస్తోంది.
181 రోజుల నుంచి 210 రోజుల డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 5.75 శాతం, సీనియర్లకు 6.25 శాతం వడ్డీ అందిస్తోంది.
211 రోజుల నుంచి 270 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 6.15 శాతం, సీనియర్లకు 6.65 శాతం వడ్డీ అందిస్తోంది.
271 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లు అయితే సాధారణ పౌరులకు 6.25 శాతం, సీనియర్లకు 6.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
360 రోజులు (బీఓబీ 360) స్పెషల్ స్కీమ్ ద్వారా జనరల్ కస్టమర్లకు 7.10 శాతం వడ్డీ ఇస్తోంది. సీనియర్లకు 50 బేసిస్ పాయింట్లు అదనంగా 7.60 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
1 ఏడాది టర్మ్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 6.85 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం వడ్డీ ఇస్తోంది.
ఏడాది నుంచి 2 ఏళ్ల టెన్యూర్లపై సాధారణ పౌరులకు 6.85 శాతం, సీనియర్లకు 7.35 శాతం ఇస్తోంది.
2 ఏళ్ల నుంచి మూడేళ్ల టర్మ్ డిపాజిట్లు అయితే సాధారణ పౌరులకు 7.25 శాతం, సీనియర్లు అయితే 7.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
అదనపు వడ్డీ లభించే టెన్యూర్లు ఇవే..
3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల డిపాజిట్లకు జనరల్ కస్టమర్లకు 6.50 శాతం వడ్డీ ఇస్తోంది. అయితే సీనియర్ సిటిజన్లకు ఈ టెన్యూర్ పై అదనంగా 15 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ కల్పిస్తోంది. అంటే సాధారణ పౌరులతో పోలిస్తే 65 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ లభిస్తోంది. దీంతో వారికి 7.15 శాతం వడ్డీ లభిస్తోంది.
ఇక 5 నుంచి 10 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.50 శాతం వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు మాత్రం అదనంగా 50 బేసిస్ పాయింట్లు వడ్డీ ఇస్తోంది. అంటే సాధారణ కస్టమర్లతో పోలిస్తే ఇచ్చే అదనపు 50 బేసిస్ పాయింట్లకు ఈ 50 బేసిస్ పాయింట్లు అదనం. మొత్తంగా 1 శాతం ఎక్కువ వడ్డీ ఇస్తోంది. ఇప్పుడు 7.50 శాతం వడ్డీ లభిస్తోంది.
బరోడా తిరంగా ప్లస్ డిపాజిట్ పథకం ద్వారా 399 రోజుల టెన్యూర్‌పై జనరల్ కస్టమర్లకు 7.15 శాతం, సీనియర్లకు 7.65 శాతం వడ్డీ అందిస్తోంది.