టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ.. ఆటతోపాటు కొన్ని బిజినెస్‌లు కూడా నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా విరాట్ కోహ్లీకి చెందిన పబ్‌పై కేసు నమోదు అయింది. బెంగళూరులో ఉన్న వన్ 8 కమ్యూన్ పబ్ సహా మరికొన్ని పబ్‌లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిబంధనలు ఉల్లంఘించి మరీ నడుపుతున్న పబ్‌లపై చర్యలు చేపట్టిన బెంగళూరు పోలీసులు.. కేసులు పెట్టారు. ఇందులో కోహ్లీకి చెందిన ఓ పబ్ కూడా ఉండడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా పబ్ నిర్వహిస్తుండటం.. పరిమితికి మించి సౌండ్, డీజేలతో స్థానికులకు ఇబ్బంది కలిగిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులతో బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగి.. నిబంధనలను ఉల్లంఘించిన పబ్‌లపై కేసులు పెట్టారు. ఇందులో విరాట్ కోహ్లీకి సంబంధించిన వన్8 కమ్యూన్ పబ్ కూడా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు సమీపంలో విరాట్ కోహ్లీకి వన్8 కమ్యూన్ పబ్ ఉంది. అదే ప్రాంతంలో మరిన్ని పబ్‌లు కూడా ఉన్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా.. ఈ పబ్‌లు నడుస్తూనే ఉన్నాయని.. భారీ శబ్దంతో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో వారు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు.
అర్ధరాత్రి 1 వరకే పబ్‌లు తెరిచి ఉంచేందుకు అనుమతి ఉన్నప్పటికీ.. వాటిని పట్టించుకోకుండా కొనసాగిస్తూనే ఉన్నారని.. బెంగళూరు సెంట్రల్ డీసీపీ వెల్లడించారు. ఈ క్రమంలోనే కొన్ని పబ్‌లపై కేసులు పెట్టినట్లు వివరించారు. ఇందులో ఎంజీ రోడ్లో ఉన్న విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ పబ్‌పై కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లు తెలిపారు. అర్ధరాత్రి 1.30 గంటల వరకు ఆ పబ్‌లో కార్యకలాపాలు సాగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వన్8 కమ్యూన్ మేనేజర్‌పై కేసు నమోదైందని.. ఈ వ్యవహారంపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బాధ్యుల్ని గుర్తించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
బెంగళూరులో మాత్రమే కాకుండా దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో కూడా ఈ వన్8 కమ్యూన్ పబ్‌లకు బ్రాంచ్‌లు ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, పూణె, కోల్‌కతాలో కూడా వన్8 కమ్యూన్ పబ్‌లను ప్రారంభించారు. 2023 డిసెంబర్లో బెంగళూరు వన్8 కమ్యూన్ పబ్‌ను ప్రారంభించారు. కస్తూర్బా రోడ్డులో ఉన్న దీని నుంచి సమీపంలో ఉన్న కబ్బన్ పార్క్, చిన్నస్వామి స్టేడియంలను వీక్షించే అవకాశం ఉంటుంది. ఇక ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీకి బెంగళూరుతో ఎనలేని అనుబంధం ఉంది.