మహిళల ఆసియాకప్ 2024 తుది పోరులో భారత్ పరాజయం పాలైంది. దంబుల్లా వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు వచ్చిన భారత్.. చివరిమెట్టుపై మాత్రం బోల్తా పడింది. దీంతో 8వ సారి ఆసియా కప్ టైటిల్‌ను సాధించాలన్న టీమిండియా ఆశలు నెరవేరలేదు. ఇదే సమయంలో శ్రీలంక మహిళల జట్టు తొలిసారి ఈ టైటిల్‌ను సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టోర్నీలో అద్భుతంగా రాణించిన భారత ఓపెనర్లు.. ఫైనల్లో మాత్రం ఆశించినంత వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు. 19 బంతుల్లో 16 రన్స్ చేసిన అనంతరం షెఫాలీ వర్మ తొలి వికెట్ రూపంలో వెనుదిరిగింది. ఆ తర్వాత ఉమా చెత్రీ (9), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (11) కూడా స్వల్ప స్కోర్లకే ఔట్ అయ్యారు. ఈ దశలో స్మృతి మంధాన 47 బంతుల్లో 60 రన్స్ చేసింది. చివర్లో రోడ్రిగ్స్ (16 బంతుల్లో 29 రన్స్), రిచా ఘోష్ (14 బంతుల్లో 30 రన్స్) చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 165/6 పరుగులు చేసింది.
అనంతరం మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళల జట్టుకు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ గుణరత్నే 1 పరుగు మాత్రమే చేసి రనౌట్ అయింది. ఈ దశలో కెప్టెన్ చమరి ఆటపట్టుకు జత కలిసిన హర్షిత సమరవిక్రమ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లింది. ఇద్దరు కూడా వీలు చిక్కనప్పుడల్లా బంతిని బౌండరీకి పంపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే ఇద్దరు బ్యాటర్లు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు.
కెప్టెన్ ఆటపట్టు (61) ఔట్ అయినా.. కవిశ దిహారీ (16 బంతుల్లో 30 రన్స్), హర్షిత్ సమరవిక్రమ (51 బంతుల్లో 69 రన్స్) పట్టు వదల్లేదు. దీంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే శ్రీలంక జట్టు విజయాన్ని సాధించింది. చరిత్రలో తొలిసారిగా మహిళల ఆసియాకప్‌ను సొంతం చేసుకుంది. భారత బౌలర్లలో దీప్తి శర్మకు మాత్రమే వికెట్ దక్కింది. ఇప్పటివరకు నాలుగు సార్లు ఫైనల్ మ్యాచ్‌లో ఓడి.. రన్నరప్‌తో నిలిచిన శ్రీలంక ఈ సారి మాత్రం టైటిల్ సాధించింది. ఇక ఎనిమిదో ఫైనల్ ఆడిన భారత్.. తొలిసారి తుదిపోరులో ఓడిపోయింది. ఇప్పటివరకు ఏడు సార్లు భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.