పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. గురువారం(ఆగష్టు 1)పూల్-బిలో భాగంగా బెల్జియంతో జరిగిన పోరులో 2-1తో భారత జట్టు ఓటమిపాలైంది. ఈ విజయంతో బెల్జియం అగ్రస్థానాన్ని చేరుకోగా.. భారత జట్టు రెండో స్థానానికి పడిపోయింది. ఎల్లో కార్డ్ కారణంగా భారత్ చివరి నిమిషాలలో 10 మంది ఆటగాళ్లతో ఆడాల్సి వచ్చింది. నిజానికి తొలి అర్ధభాగంలో ఇండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే, మూడో క్వార్టర్ లో కోలుకున్న బెల్జియం రెండు గోల్స్ వేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత స్కోరు సమం చేయడానికి ఇండియా ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇండియా తరఫున ఏకైక గోల్ 18వ నిమిషంలో అభిషేక్ చేశాడు.