ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారిస్‌లో ప్రత్యేక ఆకర్షణగా ‘ఇండియా హౌస్’.. వంటలు

sports |  Suryaa Desk  | Published : Fri, Aug 02, 2024, 10:34 PM

ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్న పారిస్ నగరంలో ఇప్పుడు ‘ఇండియా హౌస్‌’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భారత అథ్లెట్లకు భారతీయ వంటకాలను అందించడం, సన్నద్ధత కోసం ఏర్పాటు చేసిన ఇండియా హౌస్.. విదేశీ ఆటగాళ్లనూ అమితంగా ఆకర్షిస్తోంది. విశ్వక్రీడల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు మన ఇండియా హౌస్‌లో భారతీయ రుచులను ఆస్వాదించడమే కాకుండా, యోగా చేస్తూ, బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తూ ఆహ్లాదం పొందుతున్నారు. ఒత్తిడిని దూరం చేసుకుంటున్నారు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఈ ‘ఇండియా హౌస్’ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆమె ఇంటర్నేషనల్‌ ఒలింపిక్స్‌ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.


భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ఇండియా హౌస్‌ను ఏర్పాటు చేశామని నీతా అంబానీ తెలిపారు. ఇక్కడ కాశ్మీర్‌, బనారస్‌ నుంచి తీసుకొచ్చిన కళాకృతులు, హస్త కళలు, భారత సంప్రదాయ ఆభరణాలను ప్రదర్శనకు ఉంచారు. విదేశీ అథ్లెట్లు, పర్యాటకులను ఇవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కళాకారుల నృత్యాలకు కాలు కదిపి డ్యాన్స్‌ చేస్తున్నారు. ‘ఒలింపిక్ క్రీడల్లో పోటీ పడుతున్న మన అథ్లెట్ల కోసం తొలిసారిగా ఒలింపిక్స్‌ గ్రామంలో ఓ సొంత ఇల్లు ఉంది. మన అథ్లెట్లను సత్కరించడానికి, వారి విజయాలను సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఇది ఓ వేదిక. ఇంటి భోజనం మిస్సవుతున్నామనే ఇబ్బంది లేకుండా వారికి ఇది భారతీయ వంటకాలను అందిస్తోంది’ అని నీతా అంబానీ చెప్పారు.


ఒలింపిక్ కాంస్య పతక విజేత సరబ్‌జోత్ సింగ్.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో విజయం సాధించిన వెంటనే.. ఇంటి రుచిని కోరుకుంటూ ఇండియా హౌస్‌కి చేరుకున్నాడు. ‘తినడానికి ఏదో ఒకటి ఇవ్వండి’ అక్కడ ఉన్న సిబ్బందిని కోరాడు. పానీ పూరీ, బేల్ పూరీ, దోశ తిన్న తర్వాత అక్కడ ఉన్న అతిథులతో కలిసి ‘నాటు-నాటు’ పాటకు డ్యాన్స్ చేశాడు.


బిర్యానీ, మటన్ కర్రీ..


బిర్యానీ, మటన్ కర్రీ నుంచి పెరుగన్నం వరకు వివిధ రకాల భారతీయ వంటకాలను ఇండియా హౌస్ అందిస్తోంది. పారిస్‌లోని ఒలింపిక్ గ్రామంలో పరిమితమైన ఫుడ్ వెరైటీలు అందుబాటులో ఉంది. అంతేకాకుండా అక్కడ ఏసీలను నిషేధించారు (కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు). ఈ నేపథ్యంలో సౌకర్యవంతమైన గదుల మధ్య, ఇష్టమైన ఆహారాన్ని కోరుకునే అథ్లెట్లకు ఇండియా హౌస్ బెస్ట్ ఛాయిస్‌గా నిలిచింది. ఇండియా హౌస్‌లో వంటల కోసం లండన్‌లోని స్టోక్ పార్క్‌లో అంబానీల యాజమాన్యంలో నిర్వహిస్తున్న హోటల్ నుంచి చెఫ్‌లను రప్పించారు. భారతదేశం నుంచి మరి కొంత మంది చెఫ్‌లను తీసుకొచ్చారు.


భారత్ సిద్ధంగా ఉందనే సంకేతం


అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో సభ్యురాలైన నీతా అంబానీ.. ప్రపంచ వేదికపై భారతదేశ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఇండియా హౌస్‌ను ఒక అవకాశంగా భావిస్తున్నారు. భారత్ 2036 ఒలింపిక్ క్రీడలను నిర్వహించనుంది. ‘మేము ఇలాంటి ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రపంచం మొత్తానికి చూపించాలనుకుంటున్నాం’ అని ఇండియా హౌస్ ప్రారంభం సందర్భంగా నీతా అంబానీ అన్నారు. ఒలింపిక్ క్రీడా గ్రామం నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఇండియా హౌస్ ఉంది. ఇందులో వర్చువల్ రియాలిటీ టూరిజం అనుభవాలు, యోగా సెషన్‌లు, బాలీవుడ్ డ్యాన్స్ క్లాసులు, హెన్నా టాటూయింగ్, బ్లాక్ ప్రింటింగ్‌పై వర్క్‌షాప్‌లను సైతం ఏర్పాటు చేశారు.


ఇండియా హౌస్‌లో ఉదయం యోగా సెషన్లకు మంచి ఆదరణ లభిస్తోంది. యోగా పాఠాలు, బాలీవుడ్ నృత్య తరగతులకు ఫ్రెంచ్ సహా పలు దేశాలకు చెందిన అతిథులు హాజరవుతున్నారు. పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రారంభమైన మరుసటి రోజే (జులై 27) లా విల్లెట్‌ ప్రాంతంలో ఇండియా హౌస్‌ను ప్రారంభించారు. ఇండియన్‌ ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు పీటీ ఉష, బీసీసీఐ సెక్రటరీ జై షా, ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత అభినవ్‌ బింద్రాతో పాటు పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆగస్టు 11 వరకు ఇండియా హౌస్‌ను సందర్శకులు వీక్షించవచ్చు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com