పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు అదరగొడుతోంది. ఆదివారం (ఆగస్టు 04) జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత హాకీ జట్టు పెనాల్టీ షూటౌట్‌లో గ్రేట్ బ్రిటన్ జట్టుపై 4-2 అద్భుత విజయం సాధించింది. తద్వారా సెమీస్ లోకి దూసుకెళ్లింది. అలాగే పతకానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. నిజానికి 2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో అదే గ్రేట్ బ్రిటన్ జట్టును ఓడించి భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈసారి కూడా అదే జరిగింది. అయితే ఈసారి ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. గ్రూప్ దశలో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత హాకీ జట్టు ఈ మ్యాచ్ లోనూ అద్భుతంగా ఆరంభించినా.. గ్రేట్ బ్రిటన్ కూడా అద్భుతంగా ఆడింది. దీంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ వరకు వెళ్లింది. ఇరు జట్లు హోరాహీరోగా తలపడడంతో ఈ మ్యాచ్‌లో తొలి క్వార్టర్ గోల్ లేకుండా ముగిసింది. కానీ రెండో క్వార్టర్‌లో భారత జట్టు మరింత దూకుడుగా ఆడింది. మొదట భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. దీని తర్వాత, బ్రిటన్ జట్టు కూడా రెండవ క్వార్టర్‌లో గోల్ చేసి గేమ్‌ను 1-1తో సమం చేసింది. బ్రిటన్ తరఫున లీ మోర్టన్ గోల్ చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు ఎలాంటి గోల్ కొట్టలేదు.
కీలకమైన ఈ మ్యాచ్‌లో రెండో క్వార్టర్‌లోనే భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమిత్ రోహిదాస్‌కు అంపైర్ రెడ్ కార్డ్ ఇవ్వడంతో మైదానం విడిచి వెళ్లాల్సి వచ్చింది. దీంతో భారత హాకీ జట్టు మొత్తం 10 మంది ఆటగాళ్లతో మాత్రమే మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. అయినా భారత హాకీ జట్టు మంచి రక్షణాత్మక ఆటను ప్రదర్శించి బ్రిటన్ జట్టుకు ఒక్క గోల్ కూడా ఇవ్వలేదు. చివరికి మ్యాచ్ 1-1తో డ్రా కావడంతో పెనాల్టీ షూటౌట్‌లో విజేతను నిర్ణయించారు. ఇందులో భారత్ 4-2 గోల్స్ తేడాతో బ్రిటన్‌ను ఓడించింది. పెనాల్టీ షూటౌట్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ తొలి గోల్ చేయగా, ఆ తర్వాత భారత్ తరఫున సుఖ్‌జీత్, లలిత్, రాజ్‌కుమార్‌లు గోల్స్ చేశారు. అయితే భారత్ విజయంలో అనుభవజ్ఞుడైన గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు భారత హాకీ జట్టు ఆగస్టు 6న సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.